భిన్న మనస్తత్వాల ‘ఘర్షణ’

ఘర్షణ
రచన : డా||కొండపల్లి నీహారిణి
పేజీలు : 200, వెల : 150/-
ప్రతులకు : కొండపల్లి వేణుగోపాల్‌రావు
ప్లాట్‌ నెం.559, శ్రీశ్రీ హాల్స్‌, ఆల్మాస్‌గూడ,
హైదరాబాద్‌ – 500058.
సెల్‌ : 9849468931

సృజనాత్మక రచనా వ్యాసంగం దశాబ్దాలుగా కొనసాగిస్తూ ఒద్దిరాజు సోదరుల జీవితం సాహిత్యం అనే అంశంపై పి.హెచ్‌.డి. చేశారు రచయిత్రి డా||కొండపల్లి నీహారిణి. తన మామగారైన చిత్రకళా తపస్వి డా||కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర రాశారు. అలాగే తండ్రిగారైన పెండ్యాల రాఘవరావు జీవిత ప్రస్థానం అనే పుస్తకం రాశారు (వారు మాజీ ఎం.పి.). గతంలో ‘రాచిప్ప’ పేరతో కథల సంపుటి వీరు వెలువరించారు. 4 కవితా సంపుటులు వెలువరించారు. దాదాపు 23 పుస్తకాలు రాశారు వీరు. ఇప్పుడు ‘ఘర్షణ’ కథా సంపుటిలో 19 కథలు వున్నాయి. స్వేచ్ఛా పంజరం, కన్నీటి మడుగు, ఎర్రజీరల, రాచరికపు రోగాలు, ఒంటరి మేఘం, తీరం చేరని కెరటం, ఆకాశం అంచుల్లో’ లాంటి కథలు పాఠకుల్ని ఆలోచనల్లోకి తీసుకెళతాయి. కుల వృత్తుల విధ్వంసానికి మూలమైన ప్రపంచీకరణ స్వభావం చెప్పే గొప్ప మంచి కథ ‘ఒంటరి మేఘం’.
శీలా సుభద్రాదేవి, నందిని సిధారెడ్డి గారలు చక్కటి విలువైన ముందు మాటలు రాశారు. సమాజంలోని భిన్న మనస్తత్వాలు, చిత్ర విచిత్ర జీవన పరిస్థితులు, సంఘర్షణలు, సమస్యలు, కల్లోలాలు, సంక్షోభాలు ఈ కథల్లోనే బలంగా చిత్రించబడ్డాయి.
జీవితం ‘స్వేచ్ఛా పంజరం’ లాంటిది. ఎగిరిపోలేం, పంజరంలో వుండలేం. సగటు మనుషుల నిరంతర ఘర్షణ నిత్య సంఘర్షణ, మానవీయ కోణాల్ని కథల్లో ఆవిష్కరించారు. సెల్‌ ఫోన్‌కు ఎడిక్ట్‌ అయ్యే యువకుల తీరును ‘ఎర్రజీరలు’ కథలో సత్తెమ్మ పాత్ర ద్వారా ఇచ్చిన సందేశమేమిటో ఆ కథ ఆసాంతం చదివి తెలుసుకోవాలి.
మెన్‌ స్ట్రెల్‌ సమస్యను బలంగా చెప్పి ప్రకృతి సహజంగా సంభవించే నెలనెలా ఎదుర్కొనే అనివార్య స్థితిని మలినం అనీ ‘ముట్టు’ అనీ వెలుపల వుండడం అని ఆచారాలు. దూరంగా కూర్చోబెట్టే పాతకాలం ఆచార శైలి, ఆధునికంగా సమాజంలో ఉద్యోగాల్లో సంచరించే తీరును నళినీ, నీరజ పాత్రల ద్వారా చర్చకు పెట్టారు రచయిత్రి. ఆడవాళ్లందరికీ రెస్టు అందేలా ఉద్యమించాలని చెప్పే కథే ‘కొత్తచూపు’. (తంలో సాంప్రదాయక కుటుంబాల్లో ఇంట్లో స్త్రీలకు రెస్ట్‌గా కూర్చోబెట్టే పద్ధతి వుండేది). ‘ఆకాశం అంచుల్లో’ కథల్లో ఎన్‌.ఆర్‌.ఐ. లకు స్థానిక తెల్లవాళ్లకు (అమెరికన్‌లకు) ఒక కాలనీల్లో వేడుకల నేపథ్యంలో రాసన కథ.
వీర తెలంగాణ పోరాటంలో భూస్వామ్య నీటిని ఎదిరించిన ‘పొలయాల్ల’ సాధించిన సత్తెయ్య తెగువ చెప్పే కథ ‘పొల్లాల’. అన్ని కథలు ఆసాంతం చదివిస్తాయి. మనలో మానసిక ‘ఘర్షణ’కు బాధితుల పక్షాన నిలబడే ధోరణికి పురికొల్పుతాయి. మంచి కథా సంపుటి అందించిన నీహారిణి అభినందనీయురాలు.

– తంగిరాల చక్రవర్తి,
9393804472