– బీఎస్పీని గెలిపిస్తే ప్రవీణ్ కుమారే ముఖ్యమంత్రి
– ఉత్తర ప్రదేశ్‌లో మాదిరిగా పేదల అభివృద్ధికి కృషి
– పెద్దపల్లి సభలో బీఎస్పీ జాతీయ అధ్యక్షులు మాయావతి
నవతెలంగాణ – పెద్దపల్లి
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహిగా పనిచేస్తున్నారని బీఎస్పీ జాతీయ అధ్యక్షులు, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను ముఖ్యమంత్రి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, తానే ముఖ్యమంత్రి అయి తన కుటుంబ సభ్యులను మంత్రులుగా చేసుకున్నారని విమర్శించారు. పేదల సమస్యలపై బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో చేరి పనిచేస్తున్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసీఆర్ తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణలో బీఎస్పీ పార్టీని గెలిపిస్తే ప్రవీణ్ కుమార్‌ను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు.
మండల్ కమిషన్‌ను ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధికారంలో ఉన్నపుడు భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ చేశామన్నారు. తెలంగాణలో కూడా బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. సభలో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ ఎంపీ రాంజీ, రాష్ట్ర చీప్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, పెద్దపెల్లి బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష, మంథని అభ్యర్థి చల్లా నారాయణరెడ్డి, రామగుండం బీఎస్పీ అభ్యర్థి అంబటి నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.