సీఎం కేసీఆర్‌ హర్షం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌ -2023లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీం ఈవెంట్‌ (షూటింగ్‌)లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్‌ టీం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈషా సింగ్‌ టీం 1759 పాయింట్లతో భారత్‌ కు గోల్డ్‌ మెడల్‌ సాధించి, టీమ్‌ స్పిరిట్‌ను చాటిందని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివద్ధికి అమలు చేస్తున్న పటిష్ట కార్యాచరణే జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికల్లో తెలంగాణ క్రీడాకారులు కనబరుస్తున్న ప్రతిభకు నిదర్శనమని సీఎం అన్నారు. తెలంగాణ క్రీడాకారులు రానున్న రోజుల్లో మరెన్నో పతకాలు సాధించి, తెలంగాణ ఖ్యాతిని జగద్వితం చేయాలని సీఎం ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు
‘మిలాద్‌ ఉన్‌ నబీ’ పండుగ (సెప్టెంబర్‌ 28)ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లాV్‌ా ప్రపంచ శాంతి స్థాపన కోసం మహమ్మద్‌ను చివరి ప్రవక్తగా నియమించాడని ముస్లింలు భావిస్తారనీ, మహమ్మద్‌ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్‌ ఉన్‌ నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మహమ్మద్‌ ప్రవక్త బోధనలైన శాంతి, కరుణ, ధార్మిక చింతన, దాతృత్వం, ఐకమత్యం, సర్వ మానవ సమానత్వం ప్రపంచమంతా వెల్లివిరియాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. ముస్లిం మైనార్టీ ప్రజల సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్య క్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణలో గంగా జమున తహజీబ్‌’ పరిరక్షణకు తమ కషి కొనసాగుతూనే వుంటుందని సీఎం స్పష్టం చేశారు.
క్షేమంగా ఇండ్లకు వెళ్లండి
వినాయక చవితి పర్వదినం ప్రారంభం నుంచి వాడ వాడనా గణేష్‌ మండపాల ఏర్పాటు, పూజా కార్యక్రమాలతో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయని, ఈ సందర్భంగా దైవ ప్రార్థనలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసిందని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌ రావు అన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి హైదరాబాద్‌ సహా పలు ప్రధాన నిమజ్జన కేంద్రాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని సీఎం తెలిపారు. వర్షాల నేపథ్యంలో తగు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ, నిమజ్జనం కార్యక్రమంలో ఆనందోత్సాహాలతో పాల్గొని, క్షేమంగా ఇంటికి చేరుకోవాలని సీఎం కేసిఆర్‌ సూచించారు. వినాయక నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ పండుగలు ఒకే రోజు రావడం దైవేచ్ఛ అని సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక వాతావరణంలో పండుగలు జరుపుకుంటూ తెలంగాణ ‘గంగా జమున తెహజీబ్‌’ ను మరోసారి ప్రపంచానికి చాటాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.