సీఎం కేసీఆర్‌ తెలంగాణ వైతాళికుడు

నాడు ఏడు గంటలే.. నేడు 24 గంటలూ విద్యుత్‌ అంతర్జాతీయ పెట్టుబడులకు
స్వర్గధామం తెలంగాణ ఆరున్నర దశాబ్దాల అనచివేతకు… తొమ్మిదేండ్ల పరిపాలనే సమాధానం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో… సహేతుకమని చాటిచెప్పేలా దశాబ్ది ఉత్సవాలుమేయర్‌ జక్క వెంకట్‌ రెడ్డి
(ఎల్లయ్య కల్కూరి)
నవతెలంగాణ-బోడుప్పల్‌
సీఎం కేసీఆర్‌ తెలంగాణ వైతాళికుడని పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పోరేషన్‌ మేయర్‌ జక్క వెంకట్‌ రెడ్డి కొనియాడారు. నీళ్లు, నిధులు, నియామకాలలో ఉమ్మడి పాలకుల దోపిడీపై యావత్తు తెలంగాణను మేల్కొలిపిన పోరాట ఫలితమే నేటి బంగారు తెలంగాణ అన్నారు. సీఎం కేసీఆర్‌ సారధ్యంలో దశాబ్దన్నర పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అభివృద్ధిలో దేశానికే ఓ రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతున్నారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌ 2023 జూన్‌ 2వ తేదీతో తొమ్మిదేండ్ల స్వపరిపాలనను పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన దశాబ్ధి ఉత్సవాల నిర్వహణపై నవ తెలంగాణతో మాట్లాడిన పీర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌ రెడ్డి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే…
స్వరాష్ట్ర కాంక్షకు ఊపిరిపోశారు…
ప్రత్యేక తెలంగాణ కోసం గతంలో అనేక పోరాటాలు జరిగినా అవి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించేవరకు కొనసాగలేదు. తత్ఫలితంగా తెలంగాణ ఆరున్నర దశాబ్దాలపాటు అనచివేతకు గురైంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో అప్రటికత విద్యుత్‌ కోతలతో వ్యవసాయం కునారిల్లింది. నీళ్లు, నిధులు, నియామకాలలో వివక్ష చూపారు. వెరసి తెలంగాణ వ్యాప్తంగా కరువు వ్యాపించింది. పొట్టపోసుకునేందుకు అనేక మంది తెలంగాణ యువత సౌది వంటి దేశాలకు, ముంబాయి లాంటి పట్టణాలకు వలస పోవాల్సిన దుస్థితి దాపురించింది. ఈ క్రమంలోనే 2001 ఏప్రిల్‌ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంక్షకు మళ్లీ ఊపిరిపోశారు. సుమారు దశాబ్దన్నర కాలం పాటు కేసీఆర్‌ సారథ్యంలో నిర్వీరామంగా సాగిన పోరాట ఫలితం కారణంగా 2014, జూన్‌ 2న భారతదేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
ఉద్యమ సారథికే ప్రజల పట్టాభిషేకం…
తెలంగాణ ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో నడిపించిన ఉద్యమ సారథినే పరిపాలకుడిగా తెలంగాణ ప్రజలు పట్టాభిషేకం చేశారు. ప్రజల మద్దతును సమీకరించి మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. నాటి నుంచి నేటి వరకు అంటే సుమారు 9 యేండ్లుగా తెలంగాణ పునర్నిర్మాణంలో బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారు. కేసీఆర్‌ పాలనలో సమ్మిళిత అభివృద్ధి, సకల సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పారిశ్రామికావృద్ధిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పెట్టుబడులు, ఆర్ధిక అవకాశాలకు గమ్య స్థానంగా తెలంగాణ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నది. ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టడంతో తెలంగాణ నలు దిక్కులా అభివృవద్ధి విస్తరించింది.
పసిడి పంటలకు నెలవుగా…
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కరువు నేలగా ముద్రపడింది. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పసిడి పంటలు పండుతున్నాయి. తెలంగాణ నేడు దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యాన్ని గుర్తించిన కేసీఆర్‌ వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు. రైతు కేంద్రీకృతంగా దేశంలో మరెక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు వంటి పథకాలను అమలుచేసి వ్యవసాయరంగంలో సమూల మార్పులు తీసుకువచ్చారు. అలాగే జల వనరుల నిర్వహణ, నీటిపారుదల ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రం మెరుగైన వ్యవసాయ ఉత్పాదకతను సాధించింది. ఇది గ్రామీణ జీవనోపాధిని ఎంతగానో మెరుగుపరిచింది. మిషన్‌ కాకతీయ కార్యక్రమం, నీటి సంరక్షణ, భూగర్భ జలాల సమద్ధికి సహాయ పడింది. కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, సీతారామ లిస్ట్‌ జరిగేషన్‌ తో పాటు అనేక భారీ ప్రాజెక్టులు చేపట్టడంతో వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణలో గణనీయమైన మార్పు వచ్చింది. కాకతీయుల నాటి గొలుసుకట్టు నీటి వనరులైన నీటి కుంటలు, చెరువులు పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి. కాళేశ్వరానికి గానీ, పాల మూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ జరిగేషన్‌ ప్రాజెక్టుకు గానీ కేంద్ర ప్రభుత్వం జాతీయ హౌదాను ఇవ్వలేదు. అలాగే ప్రతి పౌరుడికి రక్షిత తాగునీరు అందించాలనే సంకల్పంతో మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా తెలంగాణలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన గోదావరి, కృష్ణ జలాలను అందిస్తుంది.
విద్యకు ప్రాధాన్యత…
తెలంగాణలో 100శాతం అక్షరాస్యత నమోదు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఇందులో భాగంగా వందల సంఖ్యలో గురుకుల విద్యాలయాలను స్థాపించారు. ‘మన ఊరు-మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఉన్నత విద్య కోసం అనేక కొత్త కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తి శిక్షణ కోర్సులను రూపక ల్పన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 75 ఏండ్లలో 3 వైద్య కళాశాలలు ఏర్పాటైతే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేవలం 7 ఏండ్ల వ్యవధిలోనే ఏకంగా 33 వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్న ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానిది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా, తెలంగాణలో జిల్లాకు ఒకటి చొప్పున 33 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రాబోతున్నాయి.
సింగిల్‌ విండో క్లియరెన్స్‌…
పారిశ్రామిక అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం సింగిల్‌ విండో క్లియరెన్స్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిం పారిశ్రామిక వృద్ధికి నాంది పలికారు. అలాగే పెట్టుబడులకు అనువైన వసతులను కల్పిస్తుండటం వలన నేడు విదేశీ బహులజాతీ పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులను పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. 2013-14లో అంటే రాష్ట్రం ఏర్పడటానికి ముందు రూ.5.05లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుతం 13.27 లక్షల కోట్లకు చేరింది. అలాగే తెలంగాణ జీఎస్‌డీపీ సగటు వార్షిక ద్ధిరేటు 8.6శాతం ఉంది. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,104 ఉండగా, నేడు 3,08,732తో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఈ లెక్కలన్నీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు కావు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలే.
ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ భారతదేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా అభివర్ణించారు. కానీ ప్రధాని నరేంద్రమోదీ తీరు పార్లమెం టరీ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు. కేంద్రం ఫెడరల్‌ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాలను తమ భవిష్యత్‌ను తాము నిర్ణయించుకునేలా ప్రోత్సహించాలి. కానీ నేడు దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాలపై కర్ర పెత్తానం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది.
తెలంగాణ గర్వించేలా…
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని చాటిచెప్తూ యావత్తు తెలంగాణ గర్వించేలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నం. అలాగే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ సహేతుకం అని ఇప్పటికే అనేక రంగాల్లో నిరూపితమైంది. అందుక్కారణం…కేసీఆర్‌ రాజకీయ చతురత, సుస్థిర పరిపాలనా విధానం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల గోసను దశాబ్దకాలంలో తీర్చిన కేసీఆర్‌ చిత్తశుద్ధి, ధృడసంకల్పం స్వర్ణ తెలంగాణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలో 21 రోజుల పాటు తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఈ ఉత్సవాలలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తారని ఆకాంక్షిస్తున్నా…