నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కిసాన్ సర్కార్ తోనే దేశ ప్రజల జీవితాల్లో సంపూర్ణ క్రాంతి వస్తుందని బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాల రాజకీయ నేతలు, పలు మార్కెట్ కమిటీలు, సహకార బ్యాంకుల మాజీ ఛైర్మెన్లు, మాజీ వైస్ చైర్మెన్లు సీఎం కేసీఆర్ సమక్షంలో శనివారం బీఆర్‌ఎస్‌లో పార్టీలో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా ప్రాంతాలకు, రాష్ట్రాలకు అనుగుణంగా దేశ పాలకులు నిర్ణయాలు తీసుకోనంత వరకూ అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించడానికి వీలుగా తెలంగాణలో ఎంతో కష్టపడి విధానాలను రూపొందించామని వివరించారు. వీటిని మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా అమలు చేస్తామని, రైతు సంక్షేమం కోసమే బీఆర్‌ఎస్ కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు.