నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్మరించుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ వైతాళికుడు సురవరం అని సీఎం కేసీఆర్ ఒక ప్రకటనలో కొనియాడారు. సురవరం జయంతి ఉత్సవాలను ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. సురవరం’ స్ఫూర్తిని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
సామాజిక చైతన్యానికి నిలువెత్తు స్ఫూర్తి సురవరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
భాష, సాహిత్యం, సాంస్కృతిక పునరుజ్జీవనం, ప్రాంత అభివృద్ధి కోసం సురవరం ప్రతాపరెడ్డి ఎనలేని కృషి చేశారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సురవరం జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఉన్న విగ్రహానికి మంత్రి ఆదివారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూగర్భం నుంచి అంతరిక్షం వరకు సాహిత్యం నుంచి సైన్స్ వరకు సురవరం స్పృశించని అంశం లేదని పేర్కొన్నారు. తొలిసారి వనపర్తి శాసన సభ్యులుగా ఎన్నికై కేవలం 12,13 మాసాలలోనే ఆయన మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.