పాలమూరు-రంగారెడ్డిపై సీఎం దృష్టి

– నేడు సచివాలయంలో సమీక్ష
– 15 లేదా 18న వెళ్లే అవకాశం ?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు బుధవారం సచివాలయంలో సమీక్ష చేయనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌తోపాటు నల్లగొండ జిల్లాకు ఈ ప్రాజెక్టుతో ప్రయోజనం కలగనున్న సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర అటవీ మంత్రిత్వశాఖకు చెందిన పర్యావరణ కమిటీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అటవీ అనుమతులు సైతం ఇచ్చిన విషయం విదితమే. అయితే ఇంకా ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి అనుమతిని మాత్రం కేంద్రం పెండింగ్‌లోనే పెట్టింది. ఇదిలావుండగా ఇటీవల ఈ ప్రాజెక్టు పరిధిలోని ఒక మోటర్‌కు డ్రైరన్‌ నిర్వహించారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకపోవడంతో డ్రైరన్‌ సక్సెస్‌ అయింది. దీంతో ఈ మోటర్‌ ద్వారా నార్లపూర్‌ రిజర్వాయర్‌లోకి పంపింగ్‌ చేపట్టనున్నారు. ఈనెల 15 లేదా 18 తేదీల్లో నార్లపూర్‌ రిజర్వాయర్‌ను సీఎం సందర్శించ నున్నారు. ముఖ్య మంత్రి పంపింగ్‌ను ప్రారంభించనున్నారని సాగునీటి శాఖ అధికారుల సమా చారం. ఈమేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి. మురళీధర్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భోజనం సైతం ఏర్పాటు చేయనుండటంతో దాదాపు రోజంతా సమీక్ష జరిగే అవకాశాలు లేకపోలేదు. మధ్యాహ్నాం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సైతం రానున్నారు.