– రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి
– దలాల్ స్ట్రీట్‌లో సెన్సెక్స్ 845 పాయింట్ల పతనం
– ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్
– అదానీ షేర్లపైనా ఒత్తిడి
ముంబయి : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఆందోళనలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ యుద్ధానికి తెగబడొచ్చనే అంచనాలు సోమవారం దలాల్ స్ట్రీట్‌ను కుప్పకూలేలా చేశాయి. అమ్మకాల ఒత్తిడితో బీఎస్‌ఈ సెన్సెక్స్ 845 పాయింట్లు పతనం కాగా.. నిఫ్టీ 22,300 దిగువకు పడిపోయింది. ఒక్క పూటలోనే మదుపర్ల సంపద దాదాపు రూ.5 లక్షల కోట్లు ఆవిరయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు భారత మార్కెట్లపై మరింత ఒత్తిడిని పెంచాయి.
సూచీలు రోజంతా నష్టాల్లోనే ట్రేడింగ్ అయ్యాయి. ఏ దశలోనూ కోలుకోలేదు. ఓ దశలో సెన్సెక్స్ 900 పాయింట్లు పైగా పతనమయ్యింది. తుదకు 845.12 పాయింట్ల నష్టంతో 73,399.78కు జారింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 246.90 పాయింట్లు కోల్పోయి 73,399 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.4.94 లక్షల కోట్లు పతనమై రూ.394.73 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. రెండు సెషన్లలో దాదాపు రూ.7.5లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది.
సెన్సెక్స్-30లో 27 సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1.5 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, లార్సెన్ అత్యధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, హిందాల్కో, మారుతి సుజూకీ, నెస్లే, బ్రిటానియా లాభాల్లో ముగిశాయి. చమురు, గ్యాస్, లోహ మినహా. మిగతా రంగాల సూచీలన్నీ నష్టాలు చవి చూశాయి.
అదానీ షేర్లకు యుద్ధం సెగ..
భారత కార్పొరేట్ దిగ్గజం అదానీకి యుద్ధం సెగ భారీగా తగులుతోంది. ఇజ్రాయిల్‌లో గౌతమ్ అదానీకి వ్యాపారాలు ఉండటమే ఇందుకు కారణం. 2022లో అదానీ పోర్ట్స్ జాయింట్ వెంచర్‌లో ఇజ్రాయిల్‌లోని హైఫా పోర్ట్‌ను దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ రూ.12వేల కోట్ల పైనే. ఈ వెంచర్‌లో అదానీ పోర్ట్‌కు 70 శాతం వాటా ఉంది. హమాస్‌తో యుద్ధం తర్వాత ఇప్పుడు ఇజ్రాయిల్‌లో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనడంతో అదానీ షేర్లపై ఒత్తిడి కనిపించింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్ ప్రారంభమైన వెంటనే అదానీ షేర్లు 2 శాతం మేర క్షీణించాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సూచీ 2.06 శాతం పతనమై రూ.1,316.50కు పడిపోయింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ 1.87 శాతం కోల్పోయి రూ.3,149.95 వద్ద ముగిసింది.