దళితుల సమస్యలపై కోటి సంతకాల సేకరణ

Collection of crore signatures on Dalit issues– నవంబర్‌ వరకు రాష్ట్ర సదస్సులు
– డిసెంబర్‌ 4న ‘చలో పార్లమెంట్‌’ : మల్లేపల్లి లక్ష్మయ్య, బి. వెంకట్‌ వెల్లడి
నవెతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దళితుల సమస్యలను జాతీయ ఎజెండా చేయడంలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు జాతీయ దళిత కో ఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు మల్లేపల్లి లక్ష్మయ్య, బి వెంకట్‌ తెలిపారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ దళిత సదస్సు జయప్రదంగా ముగిసిందని వారు చెప్పారు. దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల నుంచి 85 సంఘాలు, 332 మంది ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు. భూమి, ఉత్పత్తి, సంపద, బడ్జెట్‌, ప్రకృతి వనరుల్లో దళితులకు సామాజిక న్యాయం జరిగేలా ‘సమగ్రమైన డిక్లరేషన్‌’ రూపొందించినట్టు తెలిపారు. అది అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శిలా, ఓ దిక్సూచిలా ఉండే విధంగా సదస్సు తీర్మానం చేసిందన్నారు. దళితులకు భూమి, విద్యా, ఉపాధి, వైద్యం, రిజర్వేషన్లు, అత్యాచార సంఘటనలు వంటి కీలక అంశాలపై చర్చించినట్టు వారు వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు అభద్రతలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్రాల్లో దళితులపై 80శాతం దాడులు పెరిగాయని విమర్శించారు. పాఠ్యాంశాల నుంచి అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ వంటి మహనీయుల చరిత్రను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి చరిత్ర లేని సావర్కర్‌, గాడ్సే జీవిత అంశాలకు సంబంధించిన విషయాలను పాఠ్యాంశాలుగా చేర్చారని తెలిపారు. దేశవ్యాప్తంగా 20 శాతానికి పైగా ఉన్న దళితులకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో 20 శాతం నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. పదేండ్ల బీజేపీ పాలనలో దళితులకు ఇసుమంత ప్రయోజనం కూడా జరగలేదని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులన్నిటినీ అది కాలరాస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో దళితులందర్నీ ఐక్యం చేసి రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకునేందుకు తద్వారా సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం కృషి కొనసాగిస్తామన్నారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ఒకవైపు ఆదాని, అంబానీ ఆస్తులను, మత ఉద్రిక్తలను కుల విద్వేషాలను పెంచుతూ పేదలను మరింత పేదలుగా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాక్‌ లాగ్‌ పోస్టులు భర్తీ చేయడం లేదని చెప్పారు. నవంబర్‌ నాటికి అన్ని రాష్ట్రాల్లో దళిత సదస్సులు నిర్వహించాలనీ, డిసెంబర్‌ 4న చలో పార్లమెంటు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను ఓడించేందుకు ద్వారా దేశంలో దళితులు పేదలకు అండగా నిలబడాలని వారు కోరారు. ఈ మీడియా సమావేశంలో బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే. కాంతయ్య, బాలమల్లేష్‌, కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాన్‌ వెస్లీ టీ స్కైలాబ్‌ బాబు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు డిబిఎఫ్‌ జాతీయ కార్యదర్శి పి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు