జమిలిపై అభిప్రాయాల సేకరణ

Collection of opinions on Jamili– కమిటీ తొలి సమావేశం నిర్ణయం
న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించాలని ఈ అంశంపై ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం నిర్ణయించింది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నికల’ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం శనివారం నాడిక్కడ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులకు స్వాగతం పలికిన కమిటీ చైర్మెన్‌ కోవింద్‌, సమావేశ ఎజెండాను వివరించారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలపై సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది.
‘జమిలి ఎన్నికలపై సూచనలు, అభిప్రాయాల సేకరణకు.. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, పార్లమెంటులో తమ ప్రతినిధులు ఉన్న పార్టీలు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది. దీంతోపాటు భారత న్యాయ కమిషన్‌ను కూడా కమిటీ ఈ మేరకు ఆహ్వానించింది’ అని ఒక ప్రకటన వెలువడింది. అవసరమైన దస్త్రాల సన్నద్ధత, సంబంధిత పక్షాలతో సంప్రదింపులు ఎలా నిర్వహించాలి? జమిలి ఎన్నికలపై పరిశోధన తదితర అంశాలు సమావేశ ఎజెండాలో చేర్చారు.
సమావేశంలో చైర్మెన్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌తో పాటు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మెన్‌ ఎన్‌.కె సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ సి. కశ్యప్‌, విజిలెన్స్‌ కమిషనర్‌ సంజరు మాజీ చీఫ్‌ కొఠారి హాజరయ్యారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే ఆన్‌లైన్‌లో హాజరయ్యారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి సమావేశానికి హాజరు కాలేదు.