సబ్‌ సెంటర్ల పనులు పూర్తి చేయాలి : కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

నవతెలంగాణ-ములుగు
సబ్‌ సెంటర్ల నిర్మాణ టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ క్రిష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌ నుండి మంత్రి తన్నీరు హరీష్‌ రావు రాష్ట్రస్థాయి వైద్య శాఖ ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్‌లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. కలెక్టరేట్‌ వీడియో సమావేశం నుండి జిల్లా కలెక్టర్‌ క్రిష్ణ ఆదిత్య పాల్గొనగా మంత్రి దిశానిర్ధేశం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ కెసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పంపిణీ సకాలంలో గర్భిణి స్త్రీలకు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. న్యూట్రిషన్‌ కిట్లు అందించే పరికరాల నాణ్యతను ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సబ్‌ సెంటర్‌ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అప్పయ్య,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.