– నువ్వా-నేనా తేల్చుకుందాం: సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్
– కొడంగల్‌ను ఎడారిగా మార్చారంటూ విమర్శలు
– గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఓటమి తప్పదని హెచ్చరిక
నవతెలంగాణ-కొడంగల్
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లయితే కొడంగల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ తనపైన పోటీ చేసి గెలవాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులకు ఓటు వేసిన పాపానికి కొడంగల్‌కు గౌరవం తగ్గిందని, కొడంగల్ పేరు చెప్పుకోలేని పరిస్థితి దాపురించిందని విమర్శించారు. ఎన్నికలు రావడంతో బీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతున్నారని వారి మాటలు ప్రజలు నమ్మొద్దన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మించి, రెండేండ్లలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి, కొడంగల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి, ప్రజల కాళ్లు కడిగి నెత్తి పైన చల్లుకుంటామని కేసీఆర్, కేటీఆర్ అన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం తీసుకువస్తే దాన్ని మట్టిలో కలిపి పాలమూరు-రంగారెడ్డి తీసుకొస్తామని చెప్పి, కొడంగల్‌ను ఎడారిగా మార్చారని విమర్శించారు. బీఆర్‌ఎస్ వాళ్లకు ఓటు వేస్తే కొడంగల్ ఎడారిగా మారుతుందన్నారు. కేసీఆర్‌కు గజ్వేల్‌లో ఓటమి తప్పదన్నారు. రాజకీయాల్లో నువ్వా.. నేనా.. ఎవరు ఉండాలో తెల్చుకుందాం రా అని సవాల్ విసిరారు. రైతు సమస్యల పరిష్కారం, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇచ్చానని చెబుతున్న సీఎం కేసీఆర్ కొడంగల్ నుంచి పోటీ చేసి, గెలవాలని సవాల్ విసిరారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు ఎన్ని నిధులు పోయాయో కొడంగల్‌కు ఎన్ని నిధులు వచ్చాయో చెప్పాలని నిలదీశారు. దత్తత తీసుకున్న కేటీఆర్ నిధులు ఇస్తే జూనియర్ కళాశాల, కృష్ణాజలాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కొడంగల్ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కొడంగల్ మండల అధ్యక్షులు నందారం ప్రశాంత్, టీపీసీసీ ప్రతినిధి యూసుఫ్, వెంకట్‌రావు, బోడి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.