నేత్రదానానికి ముందుకు రండి

Come forward for eye donation– అంధత్వ నివారణలో భాగస్వాములు కండి : జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో డాక్టర్‌ రాజలింగం
– డాక్టర్లు, నర్సులు, వైద్యవిద్యార్థులు, ఆప్టోమెట్రిస్టుల నేత్రదాన ప్రతిజ్ఞ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నేత్రదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌, ప్రొఫెసర్‌ వి.రాజలింగం పిలుపునిచ్చారు. ప్రజలు భాగస్వాములైతేనే అంధత్వ నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. 38వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరా బాద్‌లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో నిర్వహించిన నేత్ర దాన ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 150 మంది డాక్టర్లు, నర్సులు, వైద్యవిద్యార్థులు, అప్టోమెట్రిస్ట్‌ల చేత నేత్రదానం చేస్తామని రాజలింగం ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం నేత్రదానానికి ముందుకు వచ్చిన వారి నుంచి రాతపూర్వక సమ్మతిని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆగస్టు 25న ప్రారంభమైన పక్షోత్సవాలు సెప్టెంబర్‌ 8తో ముగుస్తాయని వెల్లడించారు. నేత్రదానం చేయ కుండా ప్రజల్లో నెలకొన్న మూఢ నమ్మకాలు, సాంస్కృతిక, సంప్రదాయిక అడ్డంకులను అధిగమించేలా ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్టు తెలిపారు. ర్యాలీలు, వైద్య విద్యార్థుల్లో క్విట్‌, వ్యాసరచన, వ్యక్తృత్వ, పెయింటింగ్‌, పోస్టర్‌ తదితర విభాగాల్లో పోటీలు పెట్టి ప్రోత్సహించినట్టు తెలిపారు. ముగింపు సందర్భంగా సెప్టెంబర్‌ 8న నేత్రదానంపై అవగాహన కల్పించే స్కిట్‌ ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో నేత్రదానం కోసం రెండేండ్ల నుంచి రెండు వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. అయితే ఈ ఏడాది 56 మంది నేత్రదానం చేయగా 52 మందికి కంటిచూపు వచ్చిందని తెలిపారు.
ఏడాదికి 2.50 లక్షల కార్నియాలు అవసరం
ప్రతి ఏడాది కంటిపొరల (కార్నియా) మార్పిడి ద్వారా చికిత్స పొందేందుకు 2.50 లక్షల మంది ఎదురు చూస్తున్నారని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి కార్నియా విభాగం అధిపతి డాక్టర్‌ కేశవరావు తెలిపారు. అయితే ప్రతి ఏడాది సేకరిస్తున్న కార్నియాల సంఖ్య 25 వేల నుంచి 30 వేలు మించడం లేదని చెప్పారు. రాష్ట్రంలో కార్నియాలు అవసరమైన వారి సంఖ్య దాదాపు 50 వేల పైచిలుకు ఉంటుందని చెప్పారు. పుట్టిన బిడ్డ మొదలు 90 ఏండ్ల ముసలివారి వరకు ఎవరైనా నేత్రదానం చేయవచ్చని సూచించారు. హెచ్‌ఐవీ, క్యాన్సర్‌ రోగులు, రెటీనా పాడైపోయిన వారు తప్ప నేత్రదానానికి అందరూ అర్హులేనని స్పష్టం చేశారు. నేత్రదానం చేస్తే రెండు జీవితాలు జీవించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మోదినీ, ఆర్‌ఎంఓలు డాక్టర్‌ విజయలక్ష్మి, డాక్టర్‌ నజాఫీ బేగం, డాక్టర్‌ మాలతి క్రిస్టీనా తదితరులు పాల్గొన్నారు.
– డాక్టర్‌, ప్రొఫెసర్‌ కేశవరావు