– యూపీ గవర్నర్‌కు న్యాయస్థానం ఆదేశం : ఆగ్రహించిన ఆనందీబెన్ పటేల్
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో విచిత్రమైన, అరుదైన ఘటన జరిగింది. ఓ కుటుంబ భూ వివాదానికి సంబంధించి స్థానికుడొకరు చేసిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు బదౌన్ జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) వినీత్ కుమార్ సమన్లు జారీ చేశారు. దీనిపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో వాదనలు విన్పించేందుకు, సాక్షులను ధృవీకరించేందుకు కోర్టుకు రావాలని ఈ నెల 10న జారీ చేసిన ఆదేశాలలో ఎస్‌డీఎం పేర్కొన్నారు. ‘ఒకవేళ మీరు అక్టోబర్ 18వ తేదీన కోర్టుకు హాజరుకాని పక్షంలో ఈ కేసులో నిర్ణయం ఏకపక్షంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాము’ అని ఆ ఆదేశాలలో వివరిం చారు. కాగా కోర్టు సమన్లు అత్యంత అభ్యంతరకర మైనవని ఉత్తరప్రదేశ్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఈ కేసులో చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని బదౌన్ జిల్లా మెజిస్ట్రేట్‌కు సూచిం చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కూడా పేర్కొంది. ఈ మేరకు జిల్లా మెజిస్ట్రేట్‌కు యూపీ గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఓ లేఖ రాశారు.
‘ఈ ఘటన రాజ్యాంగంలోని ఆర్టికల్ 361ని ఉల్లంఘిస్తోంది. రాష్ట్రపతి, గవర్నర్ లేదా రాజ్ ప్రముఖ్ పదవిలో ఉన్నప్పుడు వారికి వ్యతిరేకంగా ఎలాంటి క్రిమినల్ చర్యలు చేపట్టకూడదని ఆ అధికరణ స్పష్టం చేస్తోంది’ అని ఆ లేఖలో వివరించారు. కాగా ఫిర్యాదుదారుడైన చంద్రహాస్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం… చంద్రహాస్ కుటుంబానికి చెందిన భూమిని బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంది. ఆ భూమికి ఆయనే హక్కుదారుడైనప్పటికీ ఆయన సోదరుడు దానిని మూడో వ్యక్తికి అమ్మేశాడు. ఆ మూడో వ్యక్తికే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. దీంతో చంద్రహాస్ రాష్ట్ర గవర్నర్‌ను, స్థానిక అధికారులను ప్రతివాదులుగా చేర్చి కోర్టులో కేసు వేశారు. దీనిపై గవర్నర్‌కు ఎస్‌డీఎం సమన్లు జారీ చేశారు.