రేపు అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభం

– నిరంతరం నివాళులు
– 3.29ఎకరాల్లో బ్రహ్మాండమైన నిర్మాణం
– 1700టన్ను స్టీల్‌ వాడాం
– జర్మనీ నుంచి స్టేయిన్‌లెస్‌ స్టీల్‌
– అన్ని హంగులతో ఏర్పాట్లు
– మీడియాతో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకు ఆగష్టు 15, జూన్‌ 2వ తేదిన నివాళులర్పించడం కాదు. గుడిలో పూజలు చేసినట్టుగానే అమరవీరులకు నిరంతరం నివాళులర్పించాలి. అందుకే హుస్సేన్‌సాగర్‌ తీరాన 3.29 ఎకరాల్లో బ్రహ్మాండమైన కట్టడాన్ని నిర్మించాం. గురువారం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా అమరవీరుల చిహ్నాని ప్రారంభిస్తాం’ అని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సంబంధింత ఏర్పాట్లను సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, సిటీ పోలీసు కమిషనర్‌ సీవీ.ఆనంద్‌, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డిలతో కలిసి మంగళవారం మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమరవీరులకు ప్రతి రోజూ నివాళులర్పించేవిధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రజలు, కుటుంబ సభ్యులతో కలిసి అమరవీరుల చిహ్నాన్ని సందర్శించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. 3.29ఎకరాల స్థలంలో ఆరు అంతస్తుల్లో దీన్ని నిర్మించామని తెలిపారు. లక్ష చదరపు అడుగుల్లో 400కార్ల కోసం పార్కింగ్‌ సౌకర్యం, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 30వేల చదరపు అడుగుల్లో ఎగ్జిబిషన్‌/ ఆర్ట్‌ గ్యాలరీని నిర్మించామని చెప్పారు. దీనిలో పుస్తక ప్రదర్శలు, చిత్ర ప్రదర్శనలు, తదితర కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. మొదటి అంతస్తులో అమరవీరులకు సంబంధించిన వివరాలు, ఉద్యమ ప్రస్థానం, ఫొటో గ్యాలరీ, 100సీట్లతో థియేటర్‌ నిర్మించామని తెలిపారు. ఈ థియేటర్‌లో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, రాజకీయ ప్రక్రియలు, తెలంగాణ సాధించిన ప్రగతికి సంబంధించిన 25నిమిషాల వీడియోను సందర్శకులకు చూపించనున్నామని తెలిపారు. మొదటి అంతస్తులో 800సీట్లతో కన్వెన్షన్‌హాల్‌ ఉంటుందని, దీనిలో సెమినార్లు, బిజినెస్‌ మీటింగులు, చర్చాగోష్ఠులు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి అవకాశముంద న్నారు. మూడు, నాలుగు అంతస్తుల్లో సందర్శకుల కోసం రెస్టారెంట్‌, టెర్రస్‌ రెస్టారెంట్‌, గ్రాస్‌రూఫ్‌ రెస్టారెంట్‌లను నిర్మించామని తెలిపారు. అమరవీరుల చిహ్నం చుట్టూ మూడెకరాల్లో కుటుంబసమేతంగా సందర్శించడానికి లాంజ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. అమరవీరుల చిహ్నం నిర్మాణానికి 1700టన్నుల స్ట్రక్చరల్‌ స్టీల్‌ ఉపయోగించామనీ, జర్మనీకి చెందిన 100టన్నుల స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వినియోగించామని తెలిపారు. కరోనా సమయంలో కంపెనీతో ప్రభుత్వానికి సంబంధాలు తెగిపోయాయని, ఆ సమయంలో స్టెయిలెస్‌స్టీల్‌ తీసుకురావడం కష్టంగా మారిందని చెప్పారు. అయినా జర్మనీ నుంచి స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వచ్చాకే నిర్మాణం చేపట్టాలంటూ సీఎం కేసీఆర్‌ చెప్పారని, ఖర్చుకు వెనకాడకుండా పనులు చేయాలని సూచించినట్టు తెలిపారు.
ప్రపంచంలో ఇలాంటి కట్టడాలు మూడు ఉన్నాయని, ఒకటి అమెరికాలో చికాగోబీమ్‌, రెండోది దుబాయి మ్యూజియం, మూడోది తెలంగాణ అమరవీరుల చిహ్నమని, వీటిలో ఇదే పెద్దదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఢిల్లీలోని బాపుఘాట్‌ను విదేశీయులు ఎలా సందర్శిస్తారో అదే తరహాలో హైదరాబాద్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు కూడా అమరవీరుల చిహ్నాన్ని సందర్శించుకునేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ అమరవీరులకు ఏమాత్రం గౌరవం తగ్గకుండా ఆర్‌అండ్‌బీ అధికారులు, కేపీసీ కన్‌స్ట్రక్చన్స్‌, అర్కిటెక్చర్‌, శిల్పి, ఇంజినీర్లు ఎంతో కష్టపడి పనిచేశారని తెలిపారు.
రేపు అమరవీరుల స్మృతివనం వద్ద డ్రోన్లతో లేజర్‌ షో: మంత్రి శ్రీనివాసగౌడ్‌
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈనెల 22న అమరవీరుల స్కృతివనం, తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద 750 డ్రోన్లతో లేజర్‌ మెగా డ్రోన్లషో నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాసగౌడ్‌ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లో మెగా షోలో ప్రదర్శించే డ్రోన్లను టూరిజం కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం వివిధ జిల్లాలైన వరంగల్‌, సిద్దిపేట, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాలలో లేజర్‌ షోలను ప్రదర్శిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తన్మయి, భాస్కర్‌ రెడ్డి, అనంత్‌ తదితరులు పాల్గొన్నారు.