వడగండ్ల వానతో నష్టమైన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి

– తక్షణమే పంటల నష్టాన్ని అంచనా వేయాలి:సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇటీవల ఈదురుగాలులు, వడగండ్ల వానతో రాష్ట్రంలోని మొక్కజొన్న, మామిడి, మిరప, అరటి వంటి పంటలు నాశనమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్న రైతుకు పంట చేతికొచ్చే సమయంలో ఈదురు గాలుల వల్ల నష్టం జరగడంతో వారు కోలుకున్న పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఏ యే పంటలు దెబ్బతిన్నాయి.., ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లిందో, ఎంతమంది చనిపోయారో, ఎన్ని మూగజీవాలు చనిపో యాయో తక్షణమే సర్వే చేయాలని కోరారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన ఈ సందర్బంగా డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా పిడుగుపాటుతో మూగజీవాలు, పశువుల కాపర్లు ప్రాణాలు కోల్పోయారని వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఇచ్చి ఆదుకోవాలని కోరారు.