మల్కాజిగిరి నుంచే పోటీ

Competition from Malkajigiri– ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
– కేసీఆర్‌ హామీతోనే రాజకీయాల్లోకి నా కుమారుడు
– అన్ని సర్వేల్లోనూ మేమే నెంబర్‌ వన్‌గా ఉన్నాం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. తాను పోటీ చేసే స్థానాలపై వస్తున్న వార్తలపై మైనంపల్లి శనివారం స్పందించారు. ఆయన తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మల్కాజిగిరి ప్రజలను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తనకు పదవికన్నా కార్యకర్తలే ముఖ్యమని, వారి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. కొందరు కావాలనే సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌ నియోజకవర్గాల నుంచి పోటీ
చేస్తున్నానంటూ రూమర్స్‌ పుట్టిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో 73వేల మెజార్టీని అందించిన మల్కాజిగిరి ప్రజలను వదులుకోనని చెప్పారు. 6వేల మంది కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారని, వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సర్వేల్లోనూ తామే నెంబర్‌ వన్‌గా ఉన్నామని మైనంపల్లి చెప్పుకొచ్చారు. ఈ సారి కూడా విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 27న కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.
బీఆర్‌ఎస్‌ కీలక నేతలపై పరోక్ష కామెంట్స్‌..
ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్‌ఎస్‌ నేతలపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పేర్లు తీయను కానీ.. నియోజకవర్గానికి కూడా రాకుండా తండ్రీకొడుకులను ఓడిస్తామంటూ కొందరు సవాల్‌ చేస్తున్నారన్న మైనంపల్లి.. వారికి తమ సత్తా చూపిస్తామంటూ చాలెంజ్‌ విసిరారు. తన కుమారున్ని చూసి కేసీఆరే రాజకీయాల్లోకి తీసుకురమ్మన్నారని గుర్తు చేశారు. మంచి నాయకున్ని చేద్దామని చెప్పడం వల్లే తన కుమారుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడని వివరించారు. మెడిసిన్‌ తర్వాత ఎంబీఏ కూడా చేయకుండా సేవా కార్యక్రమాల్లో నిమగమైనట్టు చెప్పారు.