ఫాబ్రిక్‌, డిజైన్‌పై ఫిర్యాదులు

– పార్లమెంట్‌ భద్రతా సిబ్బంది కొత్త యూనిఫాంపై వెనక్కి : ప్రభుత్వం ఉత్తర్వు జారీ
న్యూఢిల్లీ : పార్లమెంట్‌ భద్రతా సిబ్బంది కోసం ప్రవేశపెట్టిన కొత్త యూనిఫామ్‌ను ప్రభుత్వం ఉప సంహరించుకున్నది. కొత్త యూనిఫాంను సిబ్బంది ధరించడం ప్రారంభించిన ఒక రోజు తర్వాత బుధవారం నాడు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉత్తర్వును జారీ చేసింది. యూనిఫాం కోసం ఉపయోగించిన బట్ట, కొత్త దుస్తుల రూపకల్పన కారణంగా తమకు చెమటలు పట్టాయని భద్రతా సిబ్బంది నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. 500 మంది పార్లమెంటు భద్రతా సిబ్బంది తమ సాధారణ నేవీ బ్లూ సఫారీ సూట్‌లతో బుధవారం విధులకు వచ్చారు. యూనిఫామ్‌ను ఉపసంహరిం చుకోవడానికి ఎలాంటి అధికారిక కారణం చెప్పనప్పటికీ, చాలా మంది సిబ్బంది కొత్త దుస్తులను ధరించడానికి నిరాకరించారనీ, దాని డిజైన్‌, ఫాబ్రిక్‌తో తయారు చేయబడిన వాటిని ధరించడానికి విముఖత వ్యక్తం చేశారని సమాచారం. పార్లమెంట్‌ను కొత్త భవనానికి మార్చడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం కొత్త యూనిఫామ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ తాజా ఉత్తర్వు ప్రకారం.. ” భద్రతా సిబ్బంది కొత్త యూనిఫాం మాత్రమే ఉపసంహరించబడింది.
ఇతర సిబ్బంది వారి సంబంధిత కొత్త యూనిఫాంలను ధరించడం కొనసాగించవలసి ఉంటుంది” అని పేర్కొన్నది. అయితే, కొత్త యూనిఫాం ధరించడానికి ఇష్టపడకపోవడానికి భద్రతా సిబ్బంది ఉదహరించిన ఏకైక కారణం ”బట్ట యొక్క శ్వాస సామర్థ్యం లేకపోవడం” కావటం గమనార్హం. ఇటు పార్లమెంటు సిబ్బందికి యూనిఫాం విషయంలో మోడీ సర్కారు తీరును కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు తప్పుబట్టాయి.