సర్కార్‌కు జీపీ కార్మికుల పొర్లుదండాలు

– దమ్మపేటలో పోటీ కార్మికులతో పని చేయించే యత్నం అడ్డుకున్న పంచాయతీ కార్మికులు
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యల పరిష్కారం కోసం సుమారు నెల రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు బుధవారం సర్కార్‌కు పొర్లు దండాలు పెట్టారు. ”మాతో వెట్టిచాకిరీ చేయించుకోని.. మా కడుపులు మాడ్చుతారా” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపకపోగా.. పలుచోట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శులు పోటీ కార్మికులతో పని చేయించేందుకు యత్నించగా కార్మికులు అడ్డుకున్నారు.
నల్లగొండ జిల్లా చండూరులో దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. మునుగోడులో కార్మికులు పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలంలో కార్మికులకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పెరుమాండ్లపల్లి మోహన్‌రావు సంఘీభావం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సమ్మె శిబిరాన్ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్‌ ప్రారంభించారు. దమ్మపేటలో పోటీ కార్మికులను అడ్డుకున్నారు. అశ్వారావుపేటలో బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు.