‘సీతారామ’ కాల్వలు పూర్తిచేయండి

Complete 'Sitarama' canals– సత్తుపల్లి, పాలేరు టన్నెల్‌ కూడా…
– మే నెలాఖరుకు పూర్తయితే ఈ ఏడాదే 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు
– సమీక్షా సమావేశంలో అధికారులకు మంత్రుల ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ కాల్వల పనుల్ని మే నెలాఖరు నాటికి పూర్తిచేయాలని మంత్రులు అధికారుల్ని ఆదేశించారు. దానితోపాటే సత్తుపల్లి, పాలేరు టన్నెల్‌ పనులు కూడా పూర్తయితే ఈ ఏడాదిలోనే లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని చెప్పారు. ఆదివారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే ఈ ఏడాదిలోనే వైరా ప్రాజెక్టు, లంకా సాగర్‌, ఎన్నెస్పీ ఆయకట్టులోని సుమారు లక్షన్నర ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.7,500 కోట్లు ఖర్చు చేశారనీ, మూడు పంప్‌హౌజ్‌లు పూర్తయ్యాయనీ, ఏన్కూరు వద్ద లింకు కెనాల్‌ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. దీనికి కేవలం రూ.70 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసి చెప్పారు. రూ.12 కోట్ల వ్యయంతో యాతాలకుంట భూసేకరణ పూర్తిచేస్తే సత్తుపల్లి టన్నెల్‌ ద్వారా లంకసాగర్‌, బేతుపల్లి కెనాల్‌కు ఈ సీజన్‌లోనే సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఈఎన్సీ మురళీధర్‌తో పాటు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.