– ప్రజాసంఘాల నిరసన : దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ- విలేకరులు
మణిపూర్‌లో దారుణ ఘటనలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలు దహనం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆ రాష్ట్ర సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో శాంతిపరిరక్షణకు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.
వికారాబాద్ పట్టణంలో గిరిజన సంఘం, కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎన్‌టీఆర్ చౌరస్తాలో మతోన్మాదుల ఫొటోలను దహనం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనునాయక్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.మహిపాల్ మాట్లాడుతూ.. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం రైతుబజార్ వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. డీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో మణిపూర్ ఆకృత్యాలను అరికట్టాలని టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఐద్వా అధ్వర్యంలో నకిరేకల్‌లో నిరసన తెలిపారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి పాల్గొన్నారు. మిర్యాలగూడలో ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపి ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
మణిపూర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి
– టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మణిపూర్ ఇరువర్గాల మధ్య అల్లర్లను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్ విమర్శించారు. సభ్య సమాజం తలదించుకునే రీతిలో సంఘటనలు జరుగుతున్నా…మోడీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అధికార ప్రతినిధులు పాల్వాయి స్రవంతి, జహీర్ అక్తర్, వేణుగోపాల్ యాదవ్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు.