– పిట్టల్లా రాలిపోతున్న కూలీలు
– పని ప్రదేశాల్లో కనీస వసతులు కరువు
– రెండు సార్లు ఫొటోలతో ఇబ్బందులు
నవతెలంగాణ -తుంగతుర్తి
గ్రామాల్లో వలసలు తగ్గించి స్థానికంగా పని కల్పించాలనే లక్ష్యంతో తెచ్చిన ఉపాధి హామీ చట్టం పూర్తిగా అమలు కావడంలేదు. నిబంధనల ప్రకారం… కూలీలు పనిచేసే చోట కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఉన్నా ఎలాంటి వసతులు కల్పించడంలేదు. పూట గడవాలంటే ఉపాధి పనులకు వెళ్లక తప్పని కూలీలు అసౌకర్యాల లేమితో ఎండలో నానా ఇబ్బందులు పడుతూ పనులు చేస్తున్నారు.ఉపాధి హామీ కింద ప్రస్తుతం గ్రామాలకు దూరంగా ఉన్న చెరువుల్లో గుంతలు,పూడిక తీసే పనులు కొనసాగుతున్నాయి. ఎర్రటి ఎండలో కష్టపడి చమటోడ్చి పనిచేసిన వారికి కాసేపు సేద తీరడానికి సైతం అందుబాటులో నీడలేని దుస్థితి నెలకొంది. పని ప్రదేశంలో టెంట్లు వేయాల్సి ఉండగా అధికారులు ఆ మాటే మర్చిపోయారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం పని ప్రదేశంలో నీడ,మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు,అందుబాటులో ఉండాలని నిబంధనలు ఉన్నప్పటికీ అవి ఏమీ కానరావడం లేదు. పనిచేస్తున్న సమయంలో గాయాలయితే ప్రథమ చికిత్స అందించడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్లు సైతం పని ప్రదేశంలో ఉండటం లేదు. నాలుగు ఐదు సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను సరఫరా చేయడమే మానేసింది.
గ్రామాల్లో సిగల్స్ అంతంతే… అప్లోడ్ చేసేది ఎట్లా?
అయోమయంలో మేట్లు…. ఉపాధి కూలీలు
ఉపాధి హామీ చట్టం కింద పని చేసే కూలీల హాజరును ప్రతిరోజు కచ్చితంగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్ ద్వారా నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశంపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివద్ధి కమిషనర్ కు పంచాయతీరాజ్ అధికారులకు సర్కులర్ పంపారు. గ్రామాల్లో సెల్ ఫోన్ కు సిగల్స్ రావడమే పెద్ద కష్టం..అలాంటిది మేట్లు ప్రతిరోజు ఆన్లైన్లో హాజరును నమోదు చేసుకోవడం కత్తి మీద సామే.. దీంతో కూలీలు తమ హాజరు నమోదుపై అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసిన చోట్ల అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. కేంద్రం నిర్ణయం రాష్ట్రంలోని ఉపాధి కూలీల ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించేలా చేస్తుంది. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగానే తెరపైకి తెచ్చిన ఈ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్రం చెప్పింది ఒకలా… క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా….
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ యాప్ ఉపయోగిస్తున్నారని అవగాహన లేని వారి పరిస్థితి ఏంటి అని పలువురి ప్రశ్న. ఉపాధి హామీ కూలీలు పిట్టల్లా రాలిపోతున్న పట్టించుకునేవారు కరువయ్యారని నిబంధనల ప్రకారం వసతులు కల్పించాలని కనీసం రోజుకు 500 రూపాయలు పడేలా చూడాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధి హామీ కూలీలు పనిచేసే ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలి
దండే సైదులు ఉపాధి హామీ కూలి
గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులు దూర ప్రాంతాల్లో చేపట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అనేక ఇబ్బందుల మధ్య పనులు చేపట్టిన కూలి గిట్టుబాటు కావడం లేదు. గ్రామానికి సుమారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో పనులు చేపడుతున్నారు. దీంతో వద్ధులు కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రోజు కూలి 300 రూపాయలు అయినా పడేలా చూడాలి.