సొసైటీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించండి

– కమిషనర్‌ వంగాల సుమిత్రకు జీఎంపీఎస్‌ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్‌ డిమాండ్‌ చేశారు. మంగళశారం హైదరాబాద్‌లో రాష్ట్ర సహకార ఎన్నికల కమిషనర్‌ వంగాల సుమిత్రకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉడుత రవిందర్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 8,135 ప్రాథమిక గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాలున్నాయని తెలిపారు. వాటిలో ఎక్కువ శాతం సంఘాల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయినప్పటికీ ఎన్నికలు నిర్వహించలేదని చెప్పారు. గతంలో పశుసంవర్థక శాఖ పరిధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియను సహకార శాఖకు బదిలీ చేశారన్నారు. వాటి మధ్య సమన్వయం లేదని విమర్శించారు. కొత్తగా రూపొందించిన నిబంధనల ప్రకారం ఫోటో ఓటర్ల జాబితా తయారు చేయడం ఆలస్యమవుతున్నదని చెప్పారు. ఎలాంటి లావాదేవీలు లేని గొర్రెల పెంపకందార్ల సంఘాలకు రహస్య బ్యాలెట్‌ ద్వారా నిర్వహించే ప్రక్రియను తీసుకొచ్చారని విమర్శించారు. ఆ ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చులు అయా సొసైటీలపై వేయడం సరైంది కాదన్నారు. గ్రామస్థాయి సభ్యులకు, కొంతమంది అధ్యక్షులకు వీటిపై సరైన అవగాహన లేదని చెప్పారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రతిపాదికన జిల్లా యూనియన్లను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించలేదని తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల ఇప్పటికే ఈ సొసైటీలు డీసీసీబీ ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోయారని తెలిపారు. ఎప్పటికైనా ఎన్నికల కమిషన్‌ స్పందించి ఈ ఎన్నికలను సమన్వయం చేసేందుకు జిల్లాకొక అధికారిని ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్‌ చేశారు.
ఓటర్ల జాబితా తయారీ సులభతరం చేసి, ఎన్నికల ఖర్చులు తగ్గించి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఓటర్ల జాబితా రూపకల్పనకు స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలన్నారు. కొత్త జిల్లాల ప్రతిపాదికన జిల్లా యూనియన్లు ఏర్పాటు చేసి జిల్లా ఎన్నికలు కూడా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్‌ డ్కెరెక్టర్‌ స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దష్టికి, సహకార ఎన్నికల సంస్థ దష్టికి తీసుకెళ్లి త్వరలోనే ఎన్నికలు నిర్వహించేలా ప్రయత్నం చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాడబోయిన లింగయ్య, తుషాకుల లింగయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మద్దెపురం రాజు, అమీర్‌పేట్‌ మల్లేష్‌, కాల్వ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.