అధికారం కోసం మతాల మధ్య చిచ్చు

Conflict between religions for power–  సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క
–  సరూర్‌నగర్‌లో పాదయాత్ర
నవతెలంగాణ- చైతన్యపురి
దేశాన్ని పాలిస్తున్న బీజేపీ అధికారం కోసం మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందాలని చూస్తోందని సీఎల్పీ నాయకుడు మల్లు బట్టి విక్రమార్క అన్నారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర గురువారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో నిర్వహించిన పాదయాత్రలో భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్‌ మధుయాష్కి గౌడ్‌, మహేశ్వరం నియోజకవర్గం సీనియర్‌ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా సరూర్‌నగర్‌ డివిజన్‌ అంబేద్కర్‌నగర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి అక్కడి నుంచి ఎన్టీఆర్‌ నగర్‌లోని రాజీవ్‌ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు.
అనంతరం సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ దేశం అనేక మతాలు, కులాలు, విభిన్న సంస్కృతులు, ప్రాంతాలతో కూడినదని చెప్పారు. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డా.. ప్రతి మతానికి సంబంధించిన వాళ్లు భారతీయులే అని చెప్పారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. కేవలం అధికారం.. ఓట్ల కోసం మతాల పేరు చెప్పి ప్రజల మధ్య చిచ్చుపెట్టి వారిని విడగొట్టి లబ్దిపొందాలని చూస్తోందని విమర్శించారు. ఈ దేశ నిర్మాణం ఉన్నతంగా జరగాలని కాంగ్రెస్‌ పార్టీ కోరుకుంటున్నదని చెప్పారు. వనరులు, సంపద అందరికీ సమానంగా పంచాలన్నారు. బహుళ జాతి సంస్థల కోసం ఆలోచన చేస్తున్నారే తప్ప దేశ ప్రజల కోసం బీజేపీ ఆలోచన చేయట్లేదన్నారు. మధుయాష్కీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. మరోసారి మోసం చేసేందుకే కేసీఆర్‌ దొంగ హామీలు ఇస్తున్నారని తెలిపారు. పార్టీ మారిన నాయకులు స్వార్థం కోసం మారారు తప్ప అభివృద్ధి కోసం కాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు కోదండరెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, చిగురింత నరసింహారెడ్డి, టీపీసీసీ సెక్రెటరీ యేలేటి అమరేందర్‌ రెడ్డి, ఎనుగు జంగా రెడ్డి, బంగారు బాబు, చిలుక ఉపేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.