– అధినేత లేక అనిశ్చితి పెండింగ్‌లో ఎన్నికల నిర్ణయాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగుదేశం తెలంగాణ శాఖలో అయోమయ పరిస్థితులు నెలకొ న్నాయి. ఆ పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడంతో పెద్దదిక్కును కోల్పోయినట్ట యింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరుణంలో సంబంధిత నిర్ణయాలు అన్ని పెండింగ్‌లో పడ్డాయి. పార్టీ తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ రాష్ట్రంలో పార్టీని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బస్సుయాత్ర చేపట్టాలనుకున్నా, బాబు అరెస్ట్ నేపథ్యంలో అది వాయిదా పడింది. ప్రస్తుతం చంద్రబాబు గత నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పోటీ చేస్తారా ? లేదా ? అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకమే. బాబు అందుబాటులో లేకపోవడంతో ఎన్నికల వ్యవహారం సందిగ్ధంలో పడింది. ఆ పార్టీ, ప్రజాసంఘాల కార్యక్రమాలు పుంజుకుంటున్న నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ ఆశనిపాతంగా మారింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ అంశాలపై సమీక్షలు పూర్తయ్యాయి. పార్లమెంటు స్థానాల వారీగా పార్టీ కార్యకలాపాలను పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇటీవల ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌ను సందర్శించారు. కాసాని జ్ఞానేశ్వర్‌ను, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఇతర నేతలను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను వివరించారు. పార్టీ ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ పోటీ చేస్తుందంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు విడుదల కోసం టీడీపీ, ఇతర సంఘాలు కలిసి పలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాయి. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సైతం చంద్రబాబుకు మద్దతిస్తూ ఎన్టీఆర్‌గార్డెన్స్‌లో సంఘీభావ దీక్ష చేపట్టారు. ఏపీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీస్తున్న తరుణంలో పార్టీలో అయోమయం కనిపిస్తున్నది. అభ్యర్థుల ఎంపిక కోసం చంద్రబాబు నియమించిన స్కీనింగ్ కమిటీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడం గమనార్హం. బాబు లేకపోవడంతో అది కూడా పెండింగ్‌లో పడింది. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఒకింత నిరుత్సాహం కనిపిస్తున్నది. తెలంగాణలో ఒంటరిగానే పోటీచేస్తామని ఇంతకు ముందే చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే. ఈతరుణంలో చంద్రబాబు బెయిల్‌పై బయటకు రాగానే తెలంగాణలో పోటీచేసే స్థానాలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం లేపోలేదు. . ఇదిలావుండగా రాష్ట్రంలో 119 స్థానాల్లో పోటీ చేస్తామనీ, బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పటికే ప్రకటిం చిన సంగతి తెలిసిందే. రాజకీయ నిర్ణయాలు చేసేం దుకు చంద్రబాబు తనయుడు లోకేశ్, బాలకృష్ణతో సంప్రదింపులు చేసే అవకాశాలు కనిపిస్తున్నట్టు పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి.