కాంగ్రెస్‌ బ్యాలెన్స్‌

– అభ్యర్థుల ఎంపికలో ముఖ్య నేతలకు ప్రాధాన్యం
– సర్వే ఒకటే కాకుండా నేతల మాటకూ విలువ
– సీపీఐ- కాంగ్రెస్‌ పొత్తుతో కొత్తగూడెం కేటాయింపు
– పరస్పరం కలుసుకున్న ఇరుపార్టీల నేతలు
– పొంగులేటి ఇంటికి మట్టా దంపతులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నంతలో కాంగ్రెస్‌ టిక్కెట్ల కేటాయింపులో బ్యాలెన్స్‌ చేసింది. జిల్లాకు చెందిన సీనియర్‌, కొత్త కాంగ్రెస్‌ ముఖ్యనేతలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చినట్లు అభ్యర్థుల కేటాయింపును బట్టి అర్థమవుతోంది. సర్వేతో పాటు కీలక నేతల మాటకూ విలువనిచ్చినట్లు తెలుస్తోంది. రెండో లిస్టు వెలువడిన తర్వాత దాదాపు పది రోజులకు మూడో జాబితాను రిలీజ్‌ చేశారు. వందమంది అభ్యర్థులతో తొలిరెండు జాబితాలు వెలువడ్డాయి. ఇంకా 19 సీట్లు మాత్రమే మిగిలి ఉండగా దీనిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవే ఐదు ఉన్నాయి. ఈ ఐదుగురు ఎవరనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు సోమవారం రాత్రి 10 గంటల తర్వాత విడుదల చేసిన జాబితాలోఉమ్మడి జిల్లాలోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను కేటాయించారు. పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఇచ్చారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
పొంగులేటికి అధిక ప్రాధాన్యం…
టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు అనిపించింది. ఆయన తర్వాత మల్లు భట్టివిక్రమార్కతో పాటు సీనియర్‌ నేత రేణుకాచౌదరి మాటనూ పరిగణలోకి తీసుకున్నారు. మొత్తమ్మీద పార్టీ అంతర్గత సర్వేతో పాటు నేతల మాటకు విలువనిచ్చారనేది టిక్కెట్ల కేటాయింపును బట్టి అర్థమవుతోందని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టిక్కెట్‌ రాగా ఆయన అనుచరులు పాయం వెంకటేశ్వర్లుకు పినపాక, ఇల్లెందు నుంచి కోరం కనకయ్య, అశ్వారావుపేట నుంచి జారె ఆదినారాయణకు టిక్కెట్లు లభించాయి.
పట్టు’భట్టీ’ మరీ…
సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకు మధిర నుంచి టిక్కెట్‌ దక్కగా ఆయన అనుచరుడు, భద్రాచలం సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోడెం వీరయ్యకు మళ్లీ అదే స్థానం నుంచి టిక్కెట్‌ దక్కింది. వీరిద్దరికీ తొలిజాబితాలోనే టిక్కెట్లు రాగా మూడో జాబితాలో వైరా నుంచి మాలోత్‌ రాందాస్‌ నాయక్‌కు టిక్కెట్‌ ఇప్పించుకోవడంలో భట్టి సక్సెస్‌ అయ్యారు. వాస్తవానికి ఇక్కడి నుంచి పొంగులేటి ఫాలోవర్‌గా ఉన్న విజయాబాయికి టిక్కెట్‌ దక్కుతుందని అందరూ భావించారు. ఈ సీటు విషయంలోనే సీపీఐ(ఎం), కాంగ్రెస్‌ల పొత్తులు వికటించాయి. చర్చనీయాంశంగా మారిన వైరా సీటును చివరకి భట్టి తన అనుచరుడు రాందాస్‌ నాయక్‌కు ఇప్పించుకోగలిగారు. అయితే ఇక్కడ పార్టీ అంతర్గత సర్వేపై అనుమానాలు నెలకొన్నాయి.
ఉమ్మడి నేత మట్టాకు ఊరట…
కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్ల కేటాయింపులో చర్చనీయాంశంగా మారిన నియోజకవర్గాల్లో మరొకటి సత్తుపల్లి. ఈ స్థానం నుంచి మట్టా దయానంద్‌ విజరుకుమార్‌ టిక్కెట్‌ ఆశించారు. ఇంతలోనే దయానంద్‌ ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు కాదనే వాదన ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య రాగమయి టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 2013 నుంచి పొంగులేటి వెంట ఉంటున్న దయానంద్‌ కొద్దిరోజుల క్రితం శ్రీనివాసరెడ్డికి దూరమయ్యారు. ఈ క్రమంలో కొండూరు సుధాకర్‌ను పొంగులేటి ముందుకు తెచ్చారు. ఆయన టిక్కెట్‌ కోసం శతవిధాలా ప్రయత్నం చేశారు. సుధాకర్‌ కూడా నియోజకవర్గంలో పాదయాత్ర సైతం చేశారు. పొంగులేటికి దూరమైన దయానంద్‌ కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరికి దగ్గరయ్యారు. అంతర్గతంగా ఏమి జరిగిందో గానీ మొత్తమ్మీద మట్టా రాగమయికి టిక్కెట్‌ లభించడంతో రేణుకాకు సైతం కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చినట్టయింది.
పరస్పర కలయికలు…
సోమవారం రాత్రి టిక్కెట్లు కేటాయించగా మంగళవారం ఉదయానికే మట్టా దంపతులు ఖమ్మంలోని పొంగులేటి ఇంటికి వచ్చారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. జరిగిన పొరపాట్లను మనస్సులో పెట్టుకోకుండా తమ గెలుపునకు సహకరించాల్సిందిగా కోరారు. అందుకు శ్రీనివాసరెడ్డి నుంచి కూడా సానుకూల స్పందనే వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పొత్తులో భాగంగా తనకు సహకరించాల్సిందిగా కోరుతూ పొంగులేటి ఇంటికి వచ్చి మరీ కలిశారు. ఆ తర్వాత పొంగులేటి సైతం సీపీఐ జిల్లా కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ పాలేరు నియోజకవర్గ మీటింగ్‌లో పాల్గన్నారు. మొత్తమ్మీద కాంగ్రెస్‌ అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్‌ చేసుకొని ప్రచార జోరును పెంచేందుకు సిద్ధమవుతోంది.