ఆర్టికల్‌ 370పై కాంగ్రెస్‌ కప్పదాటు వైఖరి

ఆర్టికల్‌ 370పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్ప దంగా మారింది. న్యాయకోవిదులు, మేధావులు సుప్రీం తీర్పు వల్ల కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో మున్ముందు అవాంఛనీయ పరిణామాలు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంపై పట్టు కలిగిన న్యాయవాదిగా పేరున్న ఫాలినారిమన్‌, సుప్రీంకోర్టు మాజీ నాయమూర్తి మదన్‌ లోకుర్‌ వంటి వారు 370 ఆర్టికల్‌ రద్దు చెల్లదన్నారు. కాని చిత్రం ఏమిటంటే ఆర్టికల్‌ 370 రద్దు చేయరాదని డిమాండ్‌ చేస్తూ వచ్చిన ఆ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు కప్పదాటు వేస్తోంది. ఆర్టికల్‌ 370 రద్దుతో కాంగ్రెస్‌ ఏకీ భవిస్తూనే, దాన్ని అమలు చేసిన పద్ధతి బాగాలేదని గోడమీది పిల్లి వాటంగా చెప్పింది.
ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని మొదటి నుండి బీజేపీ డి మాండ్‌ చేస్తోంది. దాని లక్ష్యం కశ్మీరీల ప్రయోజనం కాదు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రక్రియలో భాగంగా 370ఆర్టికల్‌ను రద్దు చేయడంతో పాటు జమ్ముకశ్మీర్‌లోని లద్దాఖ్‌ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మోదీ ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యా ప్తంగా ముస్లిం విద్వేషం సృష్టించి మెజారిటీ హిందూ ఓట్లు పొంద డం బీజేపీకి ప్రధానం. కాంగ్రెస్‌ కూడా ఈ విషయంలో బీజేపీ చెప్పుల్లో తన కాళ్లు దూర్చి హిందువుల ఓట్లు రాబట్టుకోవాలని తహతహలాడుతోంది.
బీజేపీ మతతత్వ విధానాలు మన రాజ్యాంగ విలువలకు, స్వాతంత్య్రోద్యమ విలువలకు విరుద్ధమైనవి. ఈ విషయం ప్రజల ముందు వివరించి బీజేపీ రాజకీయాలను ఎండగట్టాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ దానికి విరుద్ధంగా మతతత్వ ఎజెండాలో బీజేపీతో పోటీ పడాలని భావిస్తోంది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌ ఎన్నికల తర్వాతయినా కాంగ్రెస్‌ సోయిలోకి రాలేదు.
సుప్రీం తీర్పుపై సీపీఐ(ఎం) ఘాటుగా స్పందించింది. ”ఈ తీర్పుతో సుప్రీం కోర్టు తేనెటీగల తెట్టెను కదిపింది. రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికి బదులు గవర్నర్‌ అభిప్రాయాన్ని తీసుకొంటే చాలని తద్వారా రాష్ట్రాల సరిహద్దులు కూడా మార్చుతూ రాష్ట్ర విభజన చేయవచ్చని సుప్రీం చెప్పినట్లుయింది. సమైక్యత పేరుతో కేంద్రప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడానికే తీర్పు దోహ దపడ్తోంది”. అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హెచ్చరించారు. దీనివల్ల రాజ్యాంగంలోని సమాఖ్యతత్వానికి విఘాతం కలుగుతుంది. అని సీపీఐ(ఎం) హెచ్చరించింది.
సీపీఐ కూడా ఇదే తరహా స్పందనను వ్యక్తం చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి. రాజా ఒక ప్రకటన చేస్తూ సుప్రీం తీర్పును ప్రశ్నించారు. ”బీజేపీ ప్రభుత్వం చాలా హడా విడిగా జమ్ముకశ్మీర్‌ ప్రజలను సంప్రదించకుండా ఆ రాష్ట్రంపై నిర్ణయం చేసింది. బీజేపీ చూపిన మొండి తనం దాని నియంతృత్వ ధోరణికి గుర్తు అని ఆయన విమర్శించారు. ఆర్టికల్‌ 370 రద్దులోని చట్టబద్దతపై చెప్పిన తీర్పులో సుప్రీం అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటేసిందని రాజా సుప్రీం తీర్పు సమాఖ్య వ్యవస్థకు పెద్ద విఘాతమని డిఎంకె విమర్శించింది. శివసేన సుప్రీం తీర్పును ఆహ్వానించింది. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా విలీనం చేసి గ్రేటర్‌ కశ్మీర్‌ కు ఎన్నికలు జరపాలని ఉద్ధవ్‌థాక్రే చెప్పారు. విలీనం తర్వాత ఎన్ని కలు జరడమంటే ఇక ఇప్పట్లో కశ్మీర్‌ ఎన్నికలు లేనట్లే.
మాజీ హోం మంత్రి కాంగ్రెస్‌ నాయకుడు పి.చిదంబరం అభి షేక్‌ సింఘ్వీతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఆర్టికల్‌ 370 రద్దును వెనకేసుకొచ్చారు. రద్దు చేసిన విధానంపైన మాత్రమే తాము సుప్రీంకోర్టుతో విబేధిస్తున్నామని చెప్పారు. భారత్‌ జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌ గాంధీ ఆర్టికల్‌ 370 రద్దుపై మౌనం వహించడం గమనార్హం.
‘ఇండియా’ కూటమిలో భాగస్వాములైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పిడిసి) సుప్రీం తీర్పుతో గట్టిగా విబేధించాయి. పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సుప్రీం తీర్పును ‘మరణ శాసనం’గా అభివర్ణించారు. జమ్ము కశ్మీర్‌కు మా త్రమే కాదు భారతదేశం అన్న అవగాహనకు కూడా తీర్పు వల్ల వి ఘాతం కలిగిందన్నారు. కాగా నేషనల్‌ కాన్పరెన్సు నాయకుడు ఉమర్‌ అబ్దుల్లా సుప్రీంకోర్టును ఒప్పించడంలో తాము విఫల మైనందుకు జమ్ముకశ్మీర్‌ ప్రజలు తమను క్షమించాలి అని 2019 ఆగస్టు 5న 370ని రద్దు చేస్తూ మన నుండి లాక్కొన్న గుర్తింపు, గౌరవాలు మళ్లీ మనకు ఏదో ఒకరోజు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖి లేష్‌ యాదవ్‌ మాత్రం 2019లో లోక్‌సభలో ఈ అంశంపై అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు తెలిపాయి. ప్రభుత్వం అనే క ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటేసింది. మేము సుప్రీంకోర్టుకు వెళ్లాం. ఇప్పుడు సుప్రీంకోర్టు తన నిర్ణయం తె ల్పింది. ఇక ఇప్పుడు చెప్పగలిగిందేమీ లేదు. ప్రతిఒక్కరూ సు ప్రీంకోర్టు నిర్ణయంతో ఏకీభవిస్తారని అన్నారు. ఆమ్‌ఆద్మీపార్టీ 2019లోనే ఆర్టికల్‌ 370 రద్దును సమర్ధించింది.
ఆర్టికల్‌ 370ఎ కేంద్రం రద్దు చేయడానికి ఒక రోజు ముం దు 2019 ఆగస్టు 4న శ్రీనగర్‌లోని గుప్కర్‌ రోడ్డులోని నేషనల్‌ కాన్ఫరెన్సు అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా నివాసంలో కాంగ్రెస్‌ సహా పిడిపి, ఎన్‌సి పార్టీలు సమావేశమై ఆర్టికల్‌ 370ని సమర్ధిస్తూ ఉమ్మడి ప్రకటన చేశాయి. 2020 నవంబర్‌ తర్వాత పిఏజిడి నుండి కాంగ్రెస్‌ తప్పుకొంది. అది తప్పుకోవడానికి ఒకరోజు ముందు కేంద్ర మంత్రి అమిత్‌షా పిఏజిడిని గుప్కర్‌ గ్యాంగ్‌గా అపవిత్ర గ్లోబల్‌ ఘట్బంధన్‌గా అభివర్ణించారు. అంతకు ముందు జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా తొలగించాక అక్కడి ప్రజలు ఉపాధి కుంభకోణాలతో, భూమి మాఫియా, వైన్‌షాపులు, స్మార్ట్‌ మీటర్లు వగైరా రూపంలో దారుణమైన బాధలు పడాల్సి వచ్చిందని కశ్మీర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చెప్పింది.
ఆర్టికల్‌ 370 నేపథ్యం
దేశ విభజన సందర్భంగా కశ్మీర్‌ రాజు హరిసింగ్‌ తాను స్వతంత్ర రాజుగానే కొనసాగుతానని చెప్పారు. ఒక తుది నిర్ణయానికి రాక ముందే స్థానిక ఆదివాసీల ముసుగులో పాకిస్తాన్‌ సైన్యాలు కశ్మీరుపై దాడి చేశాయి. మహారాజ హరిసింగ్‌ లోయను వదలి సురక్షితంగా వేరే ప్రాంతానికి వెళ్ళారు. ఆ దశలో ఆనాటి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు షేక్‌ అబ్దుల్లా (ఫరూక్‌ అబ్దుల్లా తండ్రి) ప్రధాన పాత్ర పోషించి భారత సైన్యాలు అక్కడ జోక్యం చేసుకొనేట్లు చూశారు. కశ్మీర్‌లో 80శాతం జనాభా ముస్లింలున్నా వారు పాకిస్తాన్‌తో విలీనం కావాలనుకోలేదు.
అయితే ఏదో ఒక ఒప్పందం లేకుండా, భారతదేశం తన సైన్యాలను అక్కడికి ఎలా పంపగలదని నెహ్రూ ప్రశ్నించారు. నెహ్రూ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని గమనంలో ఉంచుకొని ఆ రాష్ట్ర ప్రజల రక్షణ కోసం భారత రాజ్యాంగంలో 370 ఆర్టికల్‌ని చేర్చుతూ హరిసింగ్‌తో ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం లోని ప్రధాన అంశం ”ఇద్దరు ప్రధానులు రెండు రాజ్యాంగాలు” (దోప్రధాన్‌, దో విధాన్‌). భారత ప్రభుత్వం ఆ రాష్ట్ర రక్షణతో పాటు విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు, కరెన్సీలను చూసుకోవాలి. ఇతర అంశాలను కశ్మీరు రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయిస్తుంది. కశ్మీరు తన స్వంత రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి. ఆ షరతుల ప్రకారం భారత ప్రభుత్వం తన సైన్యాలను అక్కడికి పంపింది. ఆలోగా పాకిస్తాన్‌ కాశ్మీరులోని మూడవ వంతు భాగాన్ని ఆక్రమించు కొంది. ఐక్య రాజ్యసమితి తీర్మానం ప్రకారం రెండు దేశాలు తమ సైన్యాలు అక్కడ నుంచి ఉపసంహరించుకున్నాక ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్‌) జరపాలి. కాని అది ఇప్పటిదాక జరగలేదు. తన ఆధీనంలో ఉన్న కశ్మీరును ఆజాద్‌ కశ్మీరుగా పాకిస్తాన్‌ ప్రకటిం చింది. మిగతా భాగం భారతదేశంలోకి క్రమంగా భారత్‌ కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని దిగజార్చింది. 17ఏండ్ల పాటు షేక్‌ అబ్దు ల్లాను జైల్లో ఉంచింది ఈ మధ్య కాలంలో ప్రధాన మంత్రి హోదా ను ముఖ్యమంత్రి హోదాగా, సదర్‌-ఏ-రియాసత్‌ హోదాను గవ ర్నరుగా మార్చారు. క్రమంగా భారత రాజ్యాంగాన్ని కశ్మీరుకు వర్తిం పచేశారు. ప్రజాతంత్రప్రక్రియ అక్కడ క్రమంగా బలహీన పడింది.
ఫరూఖ్‌ అబ్దుల్లా ప్రభుత్వాన్ని 1984లో రద్దు చేశారు. ఆ తర్వాత 1987లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ రిగ్గింగ్‌ చేసి గెలిచిం దని ఆయన ఆరోపించారు. అక్కడి ప్రజల్లో పూర్తిగా భ్రమలు తొలగి, యువకులు హింసా రాజకీయాల్లోకి వెళ్లారు. మిలిటెన్సీ పెరిగిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకొని పాకిస్తాన్‌ తన మిలి టెంట్లను అక్కడికి పంపనారంభించింది. పరిస్థితి రోజురోజుకూ దిగజారింది. ఆ సమయంలో ఫరూక్‌ అబ్దుల్లాను ఏడేళ్ల సుదీర్ఘ కాలం జైలుకు పంపారు. ఆ స్థితిలో సోవియట్‌ సైన్యానికి వ్యతి రేకంగా పోరాడేందుకు అమెరికా సృష్టించిన అల్‌ఖైదా తన లక్ష్యం సాధించాక కశ్మీరు లోయలోకి అడుగు పెట్టింది.
టెర్రరిజమ్‌ కశ్మీరు పరిస్థితిని మరింత క్షీణింప చేసింది. స్థానిక ముస్లిం జనాభాకు, కశ్మీరు పండిట్లకు మధ్య ఉన్న సామ రస్యం స్థానంలో మతతత్వ కోణం జోడించారు. ఈ వక్రీకరణ టెర్రరిస్టులకు ఉపయోగపడింది. టెర్రరిస్టులలోని ఒక సెక్షన్‌ హిందువులను లక్ష్యంగా చేసుకుంది. కశ్మీరులోని ముస్లింలంద రూ టెర్రరిస్టులనే భావనతో అప్పటి గవర్నరు జగ్మోహన్‌ ప్రవ ర్తించారు. పండిట్లు కశ్మీరు లోయను వదిలి వెళ్తే! తాను మిలి టెంట్లను ఏరేయగలనని గవర్నర్‌ భావించారు. గవర్నరు ప్రో త్సాహంతో పండిట్లు లోయను వదిలి కాందిశీకుల శిబిరాల్లో తలదాచుకొన్నారు. టెర్రరిస్టుల వల్ల ముస్లిం జనాభా సైతం చాలా బాధలను అనుభవించింది. వారిని కూడా టెర్రరిస్టులు చంపారు. కొందరు ముస్లింలు కూడా లోయను వదిలేసి వచ్చారు. రెండు పొరుగు దేశాల మధ్య ఏర్పడిన సమస్యకు మతం రంగు అద్దారు.
భారత ప్రభుత్వం అక్కడి ప్రజల జాతి ఆకాంక్షలను అణిచి వేసింది. ఎన్నికైన ప్రభుత్వాలను పదే పదే తొలగించింది. తమకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండును పట్టించుకోలేదు. అవుట్‌లుక్‌ పత్రిక (అక్టోబరు 16, 2000) జరిపిన అభిప్రాయ సేకరణలో 74 శాతం మంది కశ్మీరీలు తమకు ప్రత్యేక గుర్తింపు కావాలని కోరారు. 16శాతం మంది కశ్మీరుకు స్వ యం ప్రతిపత్తి కావాలన్నారు. కేవలం రెండు శాతం మాత్ర మే పాకిస్తాన్‌తో విలీనం కావాలని కోరారు. 39 శాతం మం ది ప్రజలు తమకు భారత రాజ్యాంగం పరిధిలోనే పరిష్కా రం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. మిటిటెంట్ల ప్రధాన కార్యకలాపాలు 1990 నుండి ప్రారంభమయ్యాయి. అంటే 1987లో రిగ్గింగ్‌ ద్వారా జరిగిన ఎన్నికల తర్వాత అన్న మాట. కేంద్ర ప్రభుత్వంతో పాటు కశ్మీరీలు ఎన్నుకొన్న ప్రభు త్వాలు కూడా అక్కడి సాధారణ ప్రజల అభ్యున్నతికి కృషి చేయనందున కశ్మీర్‌ సమస్య మానని పుండులా మారింది.
సెల్‌ : 9989718311
ఎస్‌. వినయ కుమార్‌