ముడి చమురుపై లాభాలు ఆర్జిస్తోన్న మోడీ సర్కార్‌ : కాంగ్రెస్‌ విమర్శ

న్యూఢిల్లీ : చవకబారు చమురును ఖరీదైన రేట్లకు అమ్ముకోవడం ద్వారా మోడీ ప్రభుత్వం భయంకరమైన లాభాలు ఆర్జిస్తోందని, తద్వారా ద్రవ్యోల్బణ విష వలయంలోకి దేశాన్ని నెడుతోందని కాంగ్రెస్‌ ఆదివారం విమర్శించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు గతేడాది రూ.33 వేల కోట్లు సంపాదించగా, ఈ ఏడాది ఏకంగా లక్ష కోట్లు సంపాదించాయని పేర్కొంటున్న క్రిసిల్‌ నివేదికను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ఉటంకించారు. ప్రభుత్వ, ప్రైవేటురంగ చమురు కంపెనీలు డీజిల్‌, పెట్రోల్‌పై లీటరుకు రూ.10కి పైగా లాభం సంపాదిస్తున్నాయని రమేష్‌ పేర్కొన్నారు. గతేడాదికాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు 35శాతం మేరకు ధర తగ్గిందని చెప్పారు. ముడి చమురు ధరలు తగ్గిన మేరకు వచ్చే లాభాలను ప్రజలకు పంచడానికి బదులుగా మోడీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని కొల్లగొడుతోందని విమర్శించారు. మోడీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనలో, బ్యారెల్‌ ముడిచమురు సగటు ధర 65 డాలర్ల వరకు వుంది. గత మూడు మాసాల్లో అయితే ఈ ధర 70-80డాలర్ల మధ్యనే వుంది. ప్రభుత్వం మాత్రం రిటైల్‌ ధరలను తగ్గించలేదని అన్నారు. దీంతో దేశం ద్రవ్యోల్బణమనే విష వలయంలోకి నెట్టబడుతోందని, కూరగాయలు, పళ్లు, వంటనూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని రమేష్‌ విమర్శించారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గితే, ఇతర నిత్యావసరాల ధరలు ఆటోమేటిక్‌గా తగ్గుతాయని పేర్కొన్నారు.