– టీపీసీసీ ఎస్టీ విభాగం చైర్మెన్ బెల్లయ్య నాయక్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆదివాసీల హక్కులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నదని టీపీసీసీ ఎస్టీ విభాగం చైర్మెన్ బెల్లయ్యనాయక్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.మణిపూర్ ఆదివాసీలకు అండగా ఈనెల 3న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్టు తెలిపారు. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు మద్దతుగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. ఆగస్టు 6న ఆదివాసీ తండాల్లో బస చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. 7న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలనీ, 8న కాగడాల ప్రదర్శన చేస్తామని తెలిపారు. 9న ఆదివాసీ కవాతు, ఆదివాసీ మహాసభ నిర్వహిస్తామన్నారు. వచ్చే నెలలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు.
కేసీఆర్ కుటుంబమే బాగుపడింది
కాంగ్రెస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు డీసౌజ
బీఆర్‌ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరికీ ప్రయోజనం జరగలేదని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు డీసౌజ అన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. లక్ష రూపాయల పంట రుణమాఫీ చేయలేదన్నారు. ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. సీఎం మాయమాటలు నమ్మి మరోసారి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తగా మెట్రో ఎండీ
మహేష్ కుమార్ గౌడ్
ప్రజల సోమ్ముతో జీతాలు తీసుకుంటున్న అధికారుల్లో కొంతమంది బీఆర్‌ఎస్ కార్యకర్తల వలే మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అదే దారిలో మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి నడుస్తున్నారని ఆరోపించారు. . మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ హయాంలోనే మెట్రో రైలు 70శాతం పనులు పూర్తయ్యాయని గుర్తుచేశారు. మూడు దశల్లో మెట్రో విస్తరిస్తామని చెబుతున్న ప్రభుత్వం నిధులు ఎక్కడ నుంచి తెస్తారో చెప్పడం లేదన్నారు. ఓ వైపు భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, హెల్త్ డైరెక్టర్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీకి నిధులు లేవనీ, రైతుబంధు పూర్తిగా అమలు కావడంలేవని తెలిపారు. ఉద్యోగులకు సక్రమంగా జీతాలు అందటంలేదు…అయినా, ప్రభుత్వ పెద్దలు ఆచరణ సాధ్యంకానీ హామీలివ్వడం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్ ప్రజల ఓట్ల కోసమే మెట్రో పొడగిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిందని ఆయన పేర్కొన్నారు.