– 58 నియోజక వర్గాల అభ్యర్థులు ఖరారు
– 70 స్థానాలకు కసరత్తు పూర్తి
– 58కి అధిష్టానం ఆమోదం
– మిగతా స్థానాల్లో తీవ్ర పోటీ… ఎంపికకు మరింత కసరత్తు
– 18న తుది జాబితా విడుదల..!
న్యూఢిల్లీ : ఈ నెల 15న (ఆదివారం) కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల కానుంది. తొలి జాబితాలో 58 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. మొత్తం 70 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముగించినప్పటికీ… ఇందులో 58 మంది అభ్యర్థులకు అధిష్టానం ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం.కాగా, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో భాగంగా శుక్రవారం జీఆర్జీ రోడ్ 15 లోని ‘వార్ రూం’ లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నాలుగో సారి భేటి అయింది. మధ్యాహ్నం12 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 నిమిషాల వరకు దాదాపు రెండున్నర గంటల పాటు ఈ భేటి సాగింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ మురళీధరన్ నేతృత్వంలో జరిగిన ఈ భేటిలో కమిటీ సభ్యులు బాబా సిద్ధిఖీ, జిగేష్ మెవానీ, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రచార కమిటీ చైర్మెన్ మధు యాష్కీ, ఏఐసీసీ సెక్రటరీలు పీసీ విష్ణునాధ్, మన్సూర్ అలీఖాన్, రోహిత్ చౌదరి, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు పాల్గొన్నారు. ఈ భేటిలో ప్రధానంగా 119 స్థానాల్లో అభ్యర్థల ఎంపికపై చర్చ జరిగినట్టు తెలిసింది. సీనియర్ నేతలు బరిలో ఉన్న స్థానాలు, ఒక అసెంబ్లీకి ఒకరు లేదా ఇద్దరు పోటీ పడుతోన్న స్థానాలు, ఎలాంటి వివాదాలు లేని దాదాపు 40 నుంచి 60 స్థానాలపై మొదటి రెండు సమావేశాల్లో కమిటీకి స్పష్టత వచ్చింది. మూడో సమావేశంలో వివాదాలు, ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజక వర్గాలపై కమిటీ ఫోకస్ పెట్టింది. అయితే ఈ చర్చలో కమిటీలో ఉన్న రాష్ట్ర నేతలు తాము సూచించిన వారికే సీటు ఇవ్వాలన్న అభిప్రాయాలను వెల్లడించడంతో ఈ భేటి అసంతృప్తిగా ముగిసింది. ఇలాంటి దాదాపు 6 నుంచి 8 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను కమిటీ చైర్మెన్ ప్యానల్ కమిటీకి (సోనియా, రాహుల్) సిఫారసు చేసినట్టు తెలిసింది.
అభ్యర్థుల ఎంపికపై సీఈసీ భేటి
తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై శుక్రవారం తొలిసారి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ (సీఈసీ) భేటి అయింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటిలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ అభ్యర్థుల ఎంపికపై సీఈసీ చర్చించింది. అక్బర్ రోడ్‌లోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ భేటిలో అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ మురళీధరన్, రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కీ, సీఈసీలోని ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మురళీధరన్ ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన అభ్యర్థుల జాబితాపై ఈ భేటిలో సుదీర్ఘంగా చర్చించారు. ఉదరు పూర్ డిక్లరేషన్, సామాజిక వర్గాల విజ్ఞప్తులు, ఓయూ విద్యార్థుల డిమాండ్ల నేపథ్యంలో… పలు అసెంబ్లీ నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, స్థానిక అంశాలపై మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆరా తీసినట్టు తెలిసింది. అయితే విడుదలకు సిద్ధంగా ఉన్న దాదాపు 70 స్థానాలతో కూడిన ఫస్ట్ లిస్ట్‌లో అలాంటి వివాదస్పద సీట్లు లేవని, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న స్థానాలే ఉన్నాయని రాష్ట్ర నేతలు వివరించినట్టు విశ్వసనీయ సమాచారం.
70 సీట్లతో లిస్ట్ రెడీగా ఉంది: మురళీధరన్
70 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ మురళీధరన్ పేర్కొన్నారు. గెలుపు, ఓటములు, పార్టీ విధేయత ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, వారికి కేటాయించే సీట్లపై స్పష్టత రాగానే ఒకేసారి జాబితా ప్రకటిస్తామని చెప్పారు. సీఈసీ భేటి తర్వాత మురళీధరన్ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం జరిగిన సీఈసీ భేటిలో భేటిలో కేవలం 70 స్థానాలపై చర్చ జరిగిందన్నారు. మరోసారి సీఈసీ భేటి కానుందని చెప్పారు. ఉదరు పూర్ డిక్లరేషన్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. మైనార్టీ, మహిళలు, బీసీలు, ఇతర సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించబోతున్నట్లు చెప్పారు. అయితే ఎవరి రాజీనామాలపై స్పందించాల్సిన అవసరం లేదని పొన్నాల రాజీనామాను ఉద్దేశించి విమర్శలు చేశారు. రాజీనామాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, పార్టీలో చాలా మంది వచ్చి చేరుతున్నారని బదులిచ్చారు.
వివాదస్పద సీట్లపై నిర్ణయం అధిష్టానిదే
స్క్రీనింగ్ కమిటీలో స్పష్టత రాని వివాదస్పద సీట్లపై నిర్ణయం పార్టీ అధిష్టానిదే అని కమిటీ సభ్యులు, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ భేటి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 119 స్థానాల్లో అభ్యర్థుల పై చర్చ జరిగిందన్నారు. అన్ని సీట్లపై కసరత్తు పూర్తి అయిందన్నారు. స్పష్టత రాని కొన్ని స్థానాలను ప్యానెల్ కి పంపించినట్లు చెప్పారు. వీటిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నిర్ణయం తీసుకుంటారన్నారు. సీఈసీ ఆమోదం తర్వాత జాబితా ఏ క్షణాన్నైనా విడుదలయ్య అవకాశం ఉందని వెల్లడించారు.