కేసీఆర్‌ని గద్దెదించే శక్తి కాంగ్రెస్సే…

Congress is the power to beat KCR...– అందుకే ఆ పార్టీలో చేరుతున్నా..
– బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే
– అవకాశం ఇస్తే గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తా : మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణలో సీఎం కేసీఆర్‌ను గద్దె దించే శక్తి కాంగ్రెస్‌కే ఉందని, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా అవినీతి చేసిన కేసీఆర్‌పై చర్యలు తీసుకోకపోవడం బాధ అనిపించి, ప్రజల అకాంక్ష మేరకు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అవకాశం ఇస్తే కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండల పరిధిలోని తన ఫామ్‌హౌస్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వరాష్ట్రం కోసం తాను ఎన్నో ఉద్యమాలు చేశానని, తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలిపారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా బీజేపీలో చేరినట్టు తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి బీజేపీకి ఉండేదని, అందుకే తను ఆ పార్టీలో చేరినట్టు తెలిపారు.
తన స్వార్థం కోసం ఎప్పుడూ పార్టీ మారలేదన్నారు. అయితే రాష్ట్రాన్ని దోచుకున్న సీఎం కేసీఆర్‌, అతని కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ అవినీతి పాలనను అంతం చేయడం బీజేపీతో సాధ్యం కాదన్నారు. కేసీఆర్‌ దుర్మార్గ పాలన పోవాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.
తను ఎల్బీనగర్‌, తన భార్య మునుగోడు నుంచి పోటీ చేస్తారని మీడియాలో వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. తన భార్య ప్రత్యక్ష రాజకీయాల్లో లేదని, ఆమెకు అసలు రాజకీయాల్లోకి రావాలని లేదని స్పష్టం చేశారు. ఆమె ఎప్పటికీ పోటీ చేయదని, మునుగోడు నుంచి తానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.