సొంతోళ్లతోనే కాంగ్రెస్ నేతలకు ఇక్కట్లు..?

– మండల కాంగ్రెస్ శ్రేణుల మద్య విభేదాలు తారాస్థాయికి..
– ఎవరికి వారే యుమునా తీరే అన్నచందగా శ్రేణుల వ్యవహరణ
– ఎన్నికలు దగ్గరపడుతున్న మారని వర్గ విభేదాలు
– నియోజవర్గ నాయకుల తీరుపై కాంగ్రెస్ శ్రేణుల్లో విమర్శలు
నవతెలంగాణ – బెజ్జంకి
కాలం కలిసి రాకపోతే ఎంత కష్టపడిన ఉపయోగం ఉండదు.రాజకీయాల్లో నేతలకు కష్టమే కాదు..అదృష్టం కూడా వరించాలని పలువురు వాపోతున్నారు.రానున్న ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ మరోసారి బరిలో నిలుస్తారనే ఉహగానాలు వినిపిస్తున్నాయి.మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కవ్వంపల్లి సత్యనారాయణ ఖరారైనట్టు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.ఇంతవరకు బాగానే ఉన్న మండల కాంగ్రెస్ శ్రేణుల మద్య నెలకొన్న వర్గ విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఎవరికి వారే యుమునా తీరే అన్నచందంగా తయారవ్వడం వల్ల సోంతోళ్లతోనే అభ్యర్థులకు ఇక్కట్లు తప్పవని పలువురు పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడిని పార్టీ నుండి బహిష్కరించి వేటు వేసేలా కవ్వంపల్లి పావులు కదపడం వంటి సమాచారం చర్చనీయాంశంగా మారింది.మండల పార్టీలో నెలకొన్న విభేదాలపై వేటు అంశం మరింత ప్రభావం చూపుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కష్ట కాలంలో అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలను తట్టుకుని.. అక్రమంగా కేసులు నమోదు చేస్తే నేటికి శ్రమలు అనుభవిస్తూనే న్యాయస్థానాల చుట్టు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్నారని..వారిని పట్టించుకోకపోవడం వల్లే ఇప్పటికి వ్యతిరేకత తారాస్థాయిలో ఉందని..కేవలం తమకనుగుణంగా వ్యవహరించే వారికే పదవులిచ్చి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఊతమివ్వడం వంటి అంశాలు శ్రేణుల్లో మరింత వ్యతిరేకతను కూడగట్టుకుందంటున్నారు పార్టీ వర్గాలు.పార్టీలో నెలకొన్న విభేదాలను సమీక్షించి పరిష్కార మార్గాలు చూడకుండా ఈ విధంగానే కొనసాగిస్తే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సానుకూల పరిస్థితులు తలక్రిందులవుతాయని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.మండల కాంగ్రెస్ శ్రేణుల్లో తలెత్తిన వర్గ విభేదాలను త్వరితగతిన పరిష్కరించేల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు శ్రేణులు సూచిస్తున్నారు.
ఒకరు జాతీయ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక రాజకీయాలు చేశారు.మరోకరు రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాలు చేయడానికి సమయాత్తమవుతున్నారు.ఇరువురి ప్రధాన లక్ష్యం రానున్న ఎన్నికల్లో ప్రజల ఓట్లతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడం.కాని వారి లక్ష్యానికి సొంత పార్టీ నాయకులతోనే కష్టాలు తప్పడంలేదు. మండల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఉన్న నాయకుల తీరువల్ల నీరుగారుతోందని విమర్శలను కూడగట్టుకుంటున్నారు.ఇటీవల కవ్వంపల్లి సత్యనారాయణ వ్యవహరిస్తున్న తీరు పలువురి కాంగ్రెస్ శ్రేణులకు అస్సలు మింగుడు పడడంలేదనే ఉహగానాలు వినిపిస్తున్నాయి.అన్ని రాజకీయ పార్టీల్లో వర్గ విభేదాలున్న వాటిని పరిష్కరించే ప్రయత్నాలు అయా పార్టీల నాయకులు చేస్తున్న.. కాంగ్రెస్ పార్టీలో తలెత్తున్న వర్గ విభేదాలు ఎక్కడివక్కడే ఉండడం..సమీక్షా నిర్వహించి విబేధాలను పరిష్కరించాలనే ప్రయత్నం చేయకపోవడం పార్టీ శ్రేణులను మరింత నైరాశ్యానికి గురిచేస్తోంది.ఎన్నో ఎండ్లుగా కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో పనిచేసిన శ్రేణులను విస్మరించి..ఇటీవల చేరిన పలువురికి కవ్వంపల్లి సముచిత ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర విస్మయానికి గురిచేస్తుందని గోడు వెల్లబోసుకుంటున్నారు.
కవ్వంపల్లి తీరుపై సర్వత్రా విమర్శలు..
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా,మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జీగా కవ్వంపల్లి సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు.గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీతో రాజకీయ ఆరగేంట్రం చేసిన కవ్వంపల్లి సత్యనారాయణ పీఆర్పీ విలీన అనంతరం టీడీపీలో చేరారు.టీడీపీ నుండి తిమ్మాపూర్ జెడ్పీటీసీగా ఎన్నికై ఐదేళ్లు ప్రజలకు తనదైన శైలిలో కవ్వంపల్లి సేవలందించారు.అనంతరం ఏర్పడిన రాజకీయ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం కరీంనగర్ జిల్లాధ్యక్షుడితో పాటు నియోజకవర్గ ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు.రానున్న ఎన్నికల్లో మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలవడానికి ఎలాంటి అడ్డంకులు లేకుంఠా మార్గం సుగమమైనట్టు సమాచారం.ఇంత వరకు బాగానే ఉన్న మండలంలోని కాంగ్రెస్ శ్రేణుల మద్య తలెత్తిన వర్గ విబేధాలను పరిష్కరించి ఏకతాటిపైకి తీసుకువచ్చే విధానంలో అలసత్వం వహిస్తుండడం.. తనకు అనుకూలంగా వ్యవహరించే వారినే అక్కున చేర్చుకోవడం వంటి పరిణామాలు కలిచి వేస్తున్నాయని శ్రేణుల్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కవ్వంపల్లి వ్యవహరిస్తున్న తీరు రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుందని పలువురు మాట్లాడుకుంటున్నారు.కవ్వంపల్లికి అనుకూలంగా వ్యవహరించే వారు పొన్నంకు సహకరించమని..పొన్నంకు అనుకూలంగా వ్యవహరించే వారు కవ్వంపల్లికి సహకరించమనే వదంతులు వినిపిస్తున్నాయి.కరీంనగర్ జిల్లాలో ఎన్నో ఎండ్లుగా కాంగ్రెస్ పార్టీకి కోసం తనదైన శైలిలో అహర్నిశలు పని చేసిన పొన్నం ప్రభాకర్ కు రానున్న ఎన్నికల్లో మండల కాంగ్రెస్ శ్రేణుల నుండి కష్టాలు ఎదురవ్వక తప్పవని పలువురు కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నారు.
వేటు వేయమనడం..వ్యక్తిగత స్వార్థం కోసమే
రాష్ట్రం ఏర్పడిన నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.అధికార పార్టీల నాయకులు ఎన్నో రకాలుగా ఒత్తిడులకు గురిచేస్తె వాటిని ఎదుర్కొని పార్టీ కోసం పని చేయగా కేసులు నమోదయ్యాయి.నేటికి న్యాయస్థానాల చుట్టు తిరుగుతూనే ఉన్నాను.పార్టీ కోసం పనిచేస్తున్న వారిని విస్మరించి పని చేయనివారికి సముచిత ప్రాధాన్యత ఇస్తున్నారు నియోజకవర్గ నాయకులు.కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోకుండా పార్టీ నుండి బహిష్కరించి వేటు వేసేల పావులు కదపడం వ్యక్తిగత స్వార్థం కోసమే.పార్టీ బలోపేతానికి టీపీసీసీ అధ్యక్షుడు’ఘర్ వాపసీ’ కార్యక్రమంతో అయా పార్టీల నేతలను,కార్యకర్తలను తిరిగి చేర్చుకుంటుంటే మానకొండూర్ నియోజకవర్గంలోని బెజ్జంకి మండలంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులను బహిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని బలి చేస్తున్నారు.ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఉన్న నాయకుల తీరువల్ల నష్టం వాటిల్లుతుంది.ఇప్పటికైన మండల పార్టీలో నెలకొన్న విభేదాలను నియోజకవర్గ నాయకులు త్వరితగతిన పరిష్కరించేల ప్రత్యేక చోరవ చూపి సమన్వయంతో పని చేస్తేనే ప్రయోజనం చేకూరుతుంది.
-పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి,జిల్లాధికార ప్రతినిధి.
 విభేదాలను చక్కదిద్దుతాం.
తెలంగాణ ప్రజల అకాంక్షల మేరకు రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఎంపీగా పొన్నం ప్రభాకర్ ఎన్నో ఒడిదోడికులను ఎదుర్కొన్నాడు.తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతలను విస్మరించి ప్రాంతీయ బీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు.నాటి నుండి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలను ఎదుర్కొంటూ పార్టీ బలోపేతానికి మాజీ ఎంపీ పొన్నం నేటికి శాయశక్తుల కృషి చేస్తున్నారు.కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికి ఎల్లప్పుడు గుర్తింపు ఉంటుంది.మండల పార్టీలోని కాంగ్రెస్ శ్రేణుల మద్య నెలకొన్న విభేదాలను చక్కదిద్దుతాం. రానున్న ఎన్నికల్లో సమన్వయంతో పని చేస్తాం.
– ముక్కీస రత్నాకర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు.