– రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఎంపీల కౌంటర్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉంటే కాంగ్రెస్ నాయకులు విహార యాత్రలు, హానీ మూన్ లకు వెళ్తారని బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. కానీ కేసీఆర్ రైతుల కోసం, ప్రజల కోసం మహారాష్ట్ర వెళ్లారని రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం నాడిక్కడ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు చూసి కాంగ్రెస్ భయపడుతోందని అన్నారు. కాంగ్రెస్ నేతలు నరరూప హంతకులని తీవ్ర విమర్శలు చేసారు. కాంగ్రెస్ ఉంటే ప్రజలు మేలు కంటే నష్టం ఎక్కువన్నారు. దేశం మొత్తంలో తెలంగాణ ను భేష్ అంటున్నారని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు అన్నారు. కానీ కొందరు అనరాని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కొన్ని గ్రామాల్లో 25 ఏండ్లుగా పడని వర్షాలు పడ్డాయని, వరద ప్రాంతాల్లో ప్రభుత్వం పనిచేసిందన్నారు. అలాగే కేంద్ర బృందం తెలంగాణలో పర్యటిస్తోందని, వరద నష్టం అంచనా వేస్తుందని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరికాదన్నారు. ఎడారిలా ఉన్న తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేశారని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నోరు ఉందని అడ్డగోలుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీలకు బుద్ది చెప్పాలని రైతులను కోరారు. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీలు వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల గురించి కాంగ్రెస్ ఎంపీలు ఒక్క సారైనా నోరు విప్పారా అని ప్రశ్నించారు. దేశ ప్రజల ను కాపాడుకోడానికే బీఆర్‌ఎస్ పెట్టినట్టు చెప్పారు.
రైతులపై ఇప్పుడు ప్రేమ పుట్టిందా…?: రంజిత్ రెడ్డి
రైతులపై రేవంత్ కి ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా? అని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం మహారాష్ట్రకు వెళ్తే రేవంత్‌కు వచ్చిన బాధేంటన్నారు.
సహాయం అందని వారు ఫోన్ చేస్తే సహాయం అందిస్తామన్నారు. ఒక్క హన్మకొండ జిల్లాకు తప్ప అన్ని జిల్లాలకు పరిహారం ఇచ్చామన్నారు. అమెరికా వాళ్ళ పైసలు కనబడగానే మూడు గంటలు కరెంటు ఇస్తామంటూ రేవంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని విమర్శించారు. కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను షరతులు లేకుండా నెరవేర్చడం లేదన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ అమలు చేస్తానంటే ఎవరు నమ్మరన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమం తెలంగాణ లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు.
గోదావరి వరదలు గతంలో కంటే ఎక్కువ వచ్చాయని, అయితే వరద నష్టం వాటిల్లకుండా ముఖ్యమంత్రి వ్యవహరించారని ఎంపీ వద్ది రాజు రవిచంద్ర తెలిపారు. కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన గతంలోనే నిర్ణయించిన ప్రొగ్రాం అన్నారు. కేవలం మహారాష్ట్ర కాదు, దేశవ్యాప్తంగా కేసీఆర్ పర్యటిస్తారని చెప్పారు.