– ఎమ్మెల్సీ కవిత
– జగిత్యాల జిల్లా చల్‌గల్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ-జగిత్యాల
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరి చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్‌గల్ మ్యాంగో మార్కెట్‌లో బుధవారం బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజరుకుమార్, ఎమ్మెల్సీలు కవిత, ఎల్.రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కీలకమైన అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం రెండ్రోజుల్లో మొత్తం గాంధీ పరివారం తెలంగాణకు వస్తుంది. తెలంగాణ డిక్లరేషన్ల పేరిట ఇస్తున్న హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పనులను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కలలోనైనా ఊహించగలరా” అని ప్రశ్నించారు. ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి తెలంగాణకు రావాలన్నారు. రాహుల్‌గాంధీ అప్‌డేట్స్ లేని అవుట్ డేటెడ్ నాయకుడని విమర్శించారు. రాహుల్‌గాంధీకి ఆలోచన లేదని, సీఎం కేసీఆర్ వేగాన్ని రాహుల్ గాంధీ అందుకోలేరని అన్నారు. కేంద్రంలో ప్రధాన మంత్రి మోడీని రాహుల్ గాంధీ ఆపలేకపోతున్నారని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంజరు కుమార్‌ను గత ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.