బాన్సువాడ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం..

నవతెలంగాణ-నసురుల్లాబాద్ (బాన్సువాడ)

బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ పట్టణంలోని మార్కెట్, జండా గల్లీలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కాసుల బాలరాజ్ శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కాసుల బాలరాజు మాట్లాడుతూ బాన్సువాడ నియోజక వర్గంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలవడం ఖాయమని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చేలా యువజన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలని, వారికి నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. నాయకులకు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తొస్తారన్న మచ్చను తొలగించేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు. కాంగ్రెస్‌ అంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే కాంగ్రెస్‌ అనే గుర్తింపు తీసుకొచ్చేలా చూడాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కలెక్, మంత్రి గణేష్, గొల్లవెంకన్న యాదవ్, షోహాబ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.