కాంగ్రెస్‌ కు సీఎం పదవి కావాలి మాకు సీట్లు కావాలి

– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
న్యూఢిల్లీ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ సీఎం పదవి కావాలనీ, తమకు సీట్లు కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీయే ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. శుక్రవారం నాడిక్కడ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయస్థాయిలో సీపీఐ ఇండియా కూటమిలోనే ఉందన్నారు. అదే తరహాలో తెలంగాణలో కూడా అమలు చేయాలని మేం కోరుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ తో సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి పోటీ చేయాలని యోచిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఒక కొలిక్కి రాలేదన్నారు. మహిళ రిజర్వేషన్ల బిల్లుకు సీపీఐ మద్దతు ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ చేస్తే నార్త్‌, సౌత్‌గా దేశం విడిపోవడం ఖాయమన్నారు. డీలిమిటేషన్‌ పేరుతో రాష్ట్రాల మధ్య గొడవ పెడుతోందని ఆరోపించారు. ‘చందమామ రావే జాబిల్లి రావే’ అంటూ చిన్నారికి అన్నం తినిపించినట్టు కేంద్రం మహిళా బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శించారు. కేంద్రం తెచ్చిన బిల్లుతో ఇప్పట్లో మహిళ రిజర్వేషన్లు అమలు అయ్యే పరిస్థితి లేదన్నారు. ఎన్నికలను దష్టిలో పెట్టుకొని మహిళల ఓట్ల కోసం ఈ బిల్లు తెచ్చినట్టు ఉందని విమర్శించారు. ఈ బిల్లును తక్షణం అమలు చేయకుండా డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం రాజకీయంలో భాగమే అని విమర్శించారు.