– 50 లక్షల కు సుపారీ – అడ్వాన్స్ గా 17.5 లక్షలు
– కుట్రలో మరో ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్
నవతెలంగాణ-కోదాడ రూరల్ పట్టణంలో ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ ను హత్య చేయించటానికి మరో ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ తో పాటు మరికొందరు 50 లక్షల సుపారీ ఇచ్చి డిసిఎం తో గుద్ది చంపేలా ప్లాన్ చేసుకున్న సంఘటన పట్టణంలో పెద్ద దుమారమే లేచింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిలుకూరు మండలం కట్ట కొమ్ముగూడెం గ్రామంలోని గేట్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ కాంతారావు పై దాదాపు ఒక వారం నుండి రెక్కీ నిర్వహించిన తర్వాత ఈ నెల 19 న మునగాల మండలం మొద్దుల చెరువు స్టేజి సమీపంలో సూర్యాపేట నుండి కారులో వస్తున్న బుద్దె కాంతారావు ను సుపారీ తీసుకున్న వ్యక్తులు డిసిఎం తో కారును ఢీ కొట్టాలని చూడగా విఫలం అవ్వడంతో అదే రోజు రాత్రి మరోసారి బాబునగర్ వద్ద ప్రయత్నిoచి విఫలమయ్యారు . దీనితో నిందితులను స్థానికులతో కలసి పట్టుకున్న కాంతారావు పట్టాణ పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం 12 మందిని ఇందులో నిందితులుగా పేర్కొన్నారు . వారిలో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారిలో కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ ఉన్నారు. వీరి వద్ద నుండి 5 లక్షల రూపాయల డబ్బులు , ఒక డిసిఎం వ్యాన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం . వీరిపై 120బి , 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.