నిరంతర అధ్యయనశీలి కొరటాల..

నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేదలందరికీ భూమిని పంపిణీ చేయాలని విద్యార్థి దశలోనే ఉద్యమాల బాట పట్టిన కొరటాల సత్యనారాయణ స్ఫూర్తి నేటి తరానికి చాలా ఆదర్శమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి జ్యోతి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎంహెచ్‌ భవన్‌ (నవతెలంగాణ)లో నవతెలంగాణ బుకహేౌస్‌ సంపాదకులు కె ఆనందాచారి అధ్యక్షతన కొరటాల 17వ వర్థంతి సభను నిర్వహించారు. పత్రిక సిబ్బంది కొరటాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొరటాల నిరంతరం అధ్యయనశీలని చెప్పారు. సిద్ధాంత అధ్యయనమేగాక, ప్రజల జీవన విధానాన్ని ప్రత్యక్ష పరిశీలనతో అర్థం చేసుకునేవారని చెప్పారు. తద్వారా పోరాటాలకు రూపకల్పన చేసేవారని గుర్తు చేశారు. పత్రికతోపాటు పలు సంఘాలకు సూచనలు, సలహాలు ఇచ్చేవారన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా శ్రామిక ప్రజల పక్షాన నిలబడి వారి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడారని కొనియాడారు. నాగార్జునసాగర్‌ నిర్మాణానికి అనేక ఉద్యమాలకు ఊపిరి పోశారన్నారు. పాలమూరు ఆకలి చావులు, వలసలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారనీ, అంబలి కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు. చేనేత కార్మికులు కొరటాలను తమ వాడిగా చెప్పుకున్నారంటే వారి సమస్యలపై ఆయన చేసిన కృషి నిరూపమానమైనదని చెప్పారు. రెండు పర్యాయాలు శాసన సభ్యునిగా చట్టసభలో ప్రజావాణిని వినిపించారని గుర్తుచేశారు. నవతెలంగాణ సీజీఎం పి ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రజాశక్తి పత్రిక నడత, నడవడికలో ఆయన సూచనలు, సలహాలు మరవలేనివన్నారు. సీపీఐ(ఎం) అగ్ర నాయకుల్లో ఒకరిగా రైతు, చేనేత రంగాల్లో పోరాట యోధుడిగా కొరటాల ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కడవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన త్యాగజీవి కొరటాల అన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండాతో ప్రజలకు అండగా నిలిచిన కొరటాల జీవితం నేటి తరానికి, భవిష్యత్‌ తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. రాంపల్లి రమేష్‌, వేణుగోపాల్‌, బోర్డు సభ్యులు, జనరల్‌ మేనేజర్లు, మేనేజర్లు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.