నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌
రాంనుంతలలో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం
ఎస్డీఎఫ్‌ నిధులతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి
నవతెలంగాణ-ఆమనగల్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని రాంనుంతల గ్రామంలో బ్రిడ్జి నిర్మాణ పనులను సర్పంచ్‌ వడ్త్యావత్‌ సోనా శ్రీను నాయక్‌, ఎంపీటీసీ సభ్యులు సరిత పంతు నాయక్‌ తదితరులతో కలిసి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే కల్వకుర్తి నియోజకవర్గానికి మహర్దశ ప్రారంభమైందన్నారు. నియోజకవర్గంలో ఉన్న 164 గ్రామాలతో పాటు 2 మున్సిపాలిటీలలో విద్యా వైద్యం సంక్షేమమే లక్ష్యంగా ప్రత్యేక బడ్జెట్‌ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని అన్నారు. అందులో భాగంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన రాంనుంతల వాగుపై రూ.1.10 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నట్టు చెప్పారు. అదేవిధంగా ఎస్డీఎఫ్‌ నిధుల ద్వారా రూ.15 కోట్లు వెచ్చించి నియోజకవర్గంలోని ఎక్వాయిపల్లి, వెల్జాల్‌, మాదాయపల్లి, గట్టు ఇప్పలపల్లి, మాడుగుల, పోలేపల్లి, లింగరావుపల్లి, పడకల్‌, కొట్ర, రాచూర్‌ తదితర గ్రామాల లింకు రోడ్లను బీటీ రోడ్డుగా నిర్మిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు నేనావత్‌ అనురాధ పత్య నాయక్‌, జర్పుల దశరథ్‌ నాయక్‌, ఎంపీపీ నేనావత్‌ అనిత విజరు, ఆమనగల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ నాలాపురం శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీటీసీ దోనాదుల కుమార్‌, రైతు కోఆర్డినేటర్‌ రూప్‌ సింగ్‌, మాజీ సర్పంచ్‌ హుమ్లా నాయక్‌, ఉపసర్పంచ్‌ సోని, వార్డు సభ్యులు పద్మ, కృష్ణ, వినోద్‌, పొనుగోటి అర్జున్‌ రావు, శేఖర్‌ గౌడ్‌, యాదయ్య, సత్తయ్య, జైరాం, రవి, తల్లోజు రామకృష్ణ, వడ్డె వెంకటేష్‌, రమేష్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
56 వేల లీటర్ల పాల ఉత్పత్తి
కడ్తాల్‌ పాలశీతలీకరణ కేంద్రం పరిధిలో నిత్యం 56 వేల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుందని ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం కడ్తాల్‌ మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్‌లో పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్‌ రాధిక ఆధ్వర్యంలో విజరు డైరీ పాడి రైతులకు బ్యాంకు రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ హాజరై మాట్లాడారు. కడ్తాల్‌ మిల్క్‌ సెంటర్‌ పరిధిలోని చల్లంపల్లి, చంద్రదన, మాడ్గుల, మన్నె గుడెం బ్రాంచీల ద్వారా నిత్యం 56 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసే విధంగా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు పాడి రైతులకు రుణాలు అందించేందుకు ఎస్‌బీఐ బ్యాంకు కార్యాచరణను రూపొందిస్తున్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాలకు చెందిన పాడి పరిశ్రమ రైతులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.