– సాగర్ కింద ఎండుతున్న పంట పొలాలు
– నీటి విడుదల కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆందోళనలు
– ఆదుకోవాలని ప్రభుత్వానికి నివేదన
– డెక్ స్టోరేజీలో ఉన్నా 2004లో నీటి విడుదల
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఈ వర్షాకాలంలో ఆశించిన మేరకు వర్షాలు కురువకపోవడంతో ఎగువ రాష్ట్రాల్లోనూ తీవ్ర వర్షాభావం కారణంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు రాలేదు. దాంతో డెడ్ స్టోరేజ్‌కి చేరి.. భూగర్భ జలాలూ పెరగలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ, వరద కాల్వలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. ఫలితంగా ప్రస్తుతం సాగునీరు లేక పంటలు ఎండిపోతుంటే, రాబోయే వేసవిలో తాగునీటి కష్టాలు కూడా తీవ్రంగా ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఒక చిన్న ఆశతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వల ఆధారంగా, బోర్లు, బావుల కింద రైతులు పంటలు సాగు చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్‌లో ఉందని ఎవరూ వరి పంట సాగు చేయొద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే ఎక్కువ మంది రైతులు బోర్లు, బావులపై ఆధారపడి సాగు చేశారు. దీంతో ప్రస్తుతం సాగునీరు విడుదల కాక.. బోర్లు, బావులు అడుగంటిపోయి పంట పొలాలు ఎండిపోతున్నాయి. భూములు నెర్రలు చాచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలను బట్టి మొదటి జోన్ వరకు నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపి భూగర్భ జలాలు పెంపొందించి తమ పంట పొలాలను కాపాడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పుడు ఎడమకాల్వకు నీటిని విడుదల చేయకపోతే భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయి పంటలు పూర్తిగా ఎండిపోయి ఉమ్మడి జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
విస్తీర్ణంలో 30శాతం వరి సాగు
ఉమ్మడి జిల్లాలో సుమారు 5.81 లక్షల ఎకరాల పంట సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ 4.01 లక్షల ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు ఈ యసంగిలో సాగయ్యాయి. ఇందులో ప్రధానంగా వరిపంట 3.80లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆయకట్టు ప్రాంతంలో 3,94,285 ఎకరాల ఆయకట్టు ఉండగా, 3,08.850 ఎకరాలు సాగునీటిపై ఆధారపడి ఉంది. 41 ఎత్తిపోతల పథకాల కింద 90,922 ఎకరాల్లో ఆయకట్టు ఉంది. ఇక్కడ ఎక్కువ వరి సాగునే చేస్తారు. ఆయకట్టులో 30% వరకు అంటే 1.20 లక్షల ఎకరాల్లో బోర్లు బావుల కింద వరి సాగు చేశారు. ప్రస్తుతం బోర్లు బావులు ఎండిపోయాయి. దాని ఫలితంగా పంట పొలాలకు నీరు అందక బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అధికారులు సూచించినప్పటికీ ఇక్కడి భూములు అనుకూలంగా లేకపోవడంతో వరినే సాగు చేశారు. పంట పొట్ట దశకు రానుంది. ఆ సమయంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. సకాలంలో నీరు అందితేనే పంట చేతికి వస్తుంది. లేకపోతే పైరు ఎండిపోయే ప్రమాదముంది. కాగా 2004లో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో సాగర్ ప్రాజెక్టులో 505 అడుగుల నీటిమట్టం ఉన్నప్పటికీ.. అప్పుడు పంటలను కాపాడటంతోపాటు భూగర్భజలాలను పెంచేందుకు మొదటి జోన్ వరకు నీటిని విడుదల చేసి చెరువులను, కుంటలను నింపారు. దాని ఫలితంగా పంటలు చేతికందడంతోపాటు భూగర్భజలాలు పెరిగి తాగునీటికి కష్టం రాలేదు. ఇప్పుడు కూడా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని రైతులు కోరుతున్నారు.
నీటి విడుదల కోసం రైతుల ఆందోళనలు
ఎడమ కాల్వ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికీ అనేక దఫాలుగా రైతులు ఆందోళన చేశారు. సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులను కలిసి నీటిని విడుదల చేయాలని కోరారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి నీటి విడుదల ఆవశ్యకతను వివరించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఆశించిన మేరకు నీటి నిలువ లేనందున.. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి డ్యాం ద్వారా నీటిని తెప్పించి సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని దాని ఫలితంగా భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా సీఎంను కలిసి నీరు విడుదల చేయాలని కోరారు.
బోర్లు పోయడం లేదు..
కట్ట సైదిరెడ్డి – మంగాపురం, వేములపల్లి మండలం
చెరువుల ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. యాసంగిలో మొదట్లో బోర్లు ఆశాజనకంగా పోయడంతో నాకున్న రెండెకరాల్లో వరి సాగు చేశా. భూగర్భ జలాలు అడుగంటడంతో రెండు బోర్లు ఎండిపోయాయి. ఎకరాకు రూ.20వేల పెట్టుబడి పెట్టాం. పంట మొత్తం పొట్ట దశలో ఉంది. పైరు ఎండిపోయింది. ప్రభుత్వం దృష్టి సారించి చెరువులు నింపినట్లైతే భూగర్భ జలమట్టం పెరుగుతుంది.
ఏడెకరాల వరి పంట ఎండిపోయింది
బాలకోటి- జైత్య తండా, మిర్యాలగూడ మండలం
బోర్లు ఎండిపోవడంతో ఏడెకరాల పైరు నిలువునా ఎండిపోయింది. నాలుగు బోర్లు వేసినప్పటికీ ఫెయిల్ అయ్యాయి. ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి పెట్టాను. సుమారు రెండు లక్షల వరకు నష్టపోయాను. ఇప్పటికైనా చెరువులు నింపి భూగర్భ జలమట్టాలు పెరిగేలా చూసినట్లయితే కొద్దిగా పంట చేతికి వస్తుంది.
ఉమ్మడి జిల్లాలో సాగైన పంటల వివరాలు..
వరి 3.19.094
వేరుశనగ 17115
పెసర 1684
జొన్న 1069
మినుము 472
బొబ్బెర 304
ఆముదం 174
మొక్కజొన్న 101
ఉలువలు 49
మొత్తం 4,01,281 ఎకరాల్లో సాగు చేశారు