కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాల్సిందే..

– నియామకాల నోటిఫికేషన్‌ రద్దు చేయాలి : యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేతల డిమాండ్‌
– కొనసాగుతున్న సమ్మె
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా రాత పరీక్ష ద్వారానే పోస్టులను నింపుతామనడం హేయమైన చర్య అని యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ) హైదరాబాద్‌ నగర అధ్యక్షులు కుమారస్వామి అన్నారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం యూనియన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. రెండుసార్లు యూనియన్లతో చర్చలు జరిపినప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరిని వీడటం లేదన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న రెండో ఏఎన్‌ఎంలందర్నీ డైరెక్ట్‌గా రెగ్యులర్‌ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. కానీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టకుండా రాత పరీక్ష ద్వారానే రిక్రూట్‌మెంట్‌ చేస్తామనడం దారుణమన్నారు. నోటిఫికేషన్‌లో 1520 పోస్టులు ప్రకటించి.. యూనియన్లతో చర్చల అనంతరం 400 పైచిలుకు పోస్టులు పెంచిందన్నారు. గతంలో లేని పోస్టులు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. రాష్ట్ర జనాభా ప్రాతిపదికన, సబ్‌ సెంటర్‌ ప్రాతిపదికన లెక్కలు తీస్తే ఏఎన్‌ఎం పోస్టులు పెంచొచ్చని చెప్పారు. దాంతో రాష్ట్రంలో రెండో ఏఎన్‌ఎంలందరినీ రెగ్యులర్‌ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు ఈ రాత పరీక్ష వల్ల నష్టపోతారన్నారు. ఇదే వైద్య ఆరోగ్యశాఖలో గతంలో పారామెడికల్‌ సిబ్బందిని, మెడికల్‌ ఆఫీసర్లను ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్‌ చేసినప్పటికీ.. ఏఎన్‌ఎంల విషయంలో ప్రభుత్వం ఎందుకు ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి ఏ.కవిత, హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి కిరణ్మయి, నాయకులు రాజేశ్వరి, లక్ష్మి, అమ్మాజీ, విజయ, ప్రణయశీల పాల్గొన్నారు. భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలో ఆందోళన కొనసాగించారు. సీపీఐ(ఎం), కాంగ్రెస్‌ నాయకులు మద్దతు తెలిపారు.