కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె. వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి జె.కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు జె. కుమారస్వామి తదితరులు కలిసి మెమోరాండం అందజేశారు. రాష్ట్రంలో 40 శాఖల్లో 1,40,000 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారనీ, వారికి ఎక్కడా కనీస వేతనం దక్కకపోగా ఐదారు నెలలకోసారి వేతనాలు ఇస్తున్నారని సీఎస్‌ దృష్టికి వారు తీసుకెళ్లారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తుండటంతో వారి కుటుంబాలు కూడా గడవటం కష్టమవుతున్న తీరును వివరించారు. జూలై నుంచి ప్రభుత్వోద్యోగులతో పాటు వారికి కొత్త వేతనాలు అమలు చేయాలని కోరారు. యూనివర్సిటీలు, వైద్య ఆరోగ్య, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయితీ కేంద్ర – రాష్ట్ర పథకాల్లోని సిబ్బందితో సహా వివిధ డిపార్ట్‌మెంట్లలో ఏజెన్సీలు రిక్రూట్‌ చేసిన ఉద్యోగులతో సహా అందర్నీ పీఆర్సీ జీవో పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. పాలిటెక్నిక్‌ విభాగంలో సుమారు 200 మందిని రెన్యూవల్‌ చేయలేదనీ, వారి సమస్యను పరిష్కరించాలని కోరారు. టెర్మినేట్‌ చేసిన 23 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇవ్వడంతో పాటు ప్రతి నెలా మొదటి వారంలోనే వేతనాలు ఇవ్వాలని కోరారు. పెండింగ్‌ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.