హింసను నియంత్రించండి

– మణిపూర్‌ అల్లర్లపై ఢిల్లీలో విద్యార్థి, యువజన సంఘాల ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

నెలల తరబడి అల్లర్లు చెలరేగుతున్న మణిపూర్‌లో కేంద్ర ప్రభుత్వం తక్షణమే శాంతిని నెలకొల్పాలని డిమాండ్‌ చేస్తూ, కూకి మహిళలను అమానుషంగా హింసించడాన్ని నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆందోళనలో మణిపూర్‌ స్థానికులు కూడా పాల్గొన్నారు. డీవైఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ ఎఎ రహీమ్‌ మాట్లాడుతూ మోడీ పాలనలో ఏ మహిళకు భద్రత లేదని, మణిపూర్‌ ప్రజలకు భద్రత కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ప్రధాని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూఖ్‌ బిస్వాస్‌, జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌ తదితరులు మాట్లాడారు.