సహకరించండి…

– రాజకీయపార్టీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజ్ఞప్తి
– పార్టీల ప్రతినిధులతో భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శాసనసభ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజకీయపార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ విజ్ఞప్తి చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయపార్టీలు సోషల్‌ మీడియా సహా ఏ రూపంలో సాక్ష్యాలతో ఫిర్యాదు చేసినా, సానుకూలంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా న్యాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మంగళవారంనాడిక్కడి ఎన్నికల కార్యాలయంలో రాజకీయపార్టీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. సీపీఎం ప్రతినిధులుగా ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జే బాబురావు హాజరయ్యారు. సీపీఐ, బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీఎస్పీ, ఆప్‌ సహా గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సీఈసీ అదనపు ఈసీఓ లోకేష్‌కుమార్‌, జాయింట్‌ సీఈఓ సర్ఫరాజ్‌ అహ్మద్‌, డిప్యూటీ సిఈఓ సత్యవాణి రాజకీయపార్టీల ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అక్టోబర్‌ 30 వరకు కొత్త ఓటర్ల నమోదు కొనసాగుతుందనీ, ఈ ఏడాది జనవరి 5 నుంచి ఇప్పటి వరకు 27.5 లక్షల ఓటరు కార్డులు ముద్రించి ఓటర్లకు అందించామని అధికారులు తెలిపారు. ఈ-ఎపిక్‌ కార్డులను ఓటర్ల సేవా పోర్టల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా రాజకీయపార్టీలు అనుసరించాల్సిన విధివిధానాలు, నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, స్టార్‌ క్యాంపెయినర్లు, మ్యానిఫెస్టోలు, నామినేషన్లు, అఫిడవిట్లు, ప్రకటనల ముందస్తు ధృవీకరణ నియమ నిబంధనలు, సోషల్‌ మీడియా వినియోగం వంటి పలు అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సీపీఎం ప్రతినిధులు పలు అంశాలను ఎన్నికల కమిషన్‌ ఎదుట ప్రస్తావించారు. రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లే డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం చూసామనీ, అలాటి చర్యల్ని ఎలా నియంత్రిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల రోజు తమ ఓటు ఏ పోలింగ్‌ బూత్‌లో ఉందో తెలుసుకోవడం ఓటర్లకు ఇబ్బందిగా మారుతున్నదనీ, పోలింగ్‌కు ముందే ఎన్నికల సిబ్బంది ఓటర్‌ స్లిప్పుల్ని అందచేస్తే బాగుంటుందని సూచించారు. పోలింగ్‌, కౌంటింగ్‌ ఏజెంట్లపై ఎఫ్‌ఐఆర్‌లు ఉంటే అనుమతించట్లేదనీ, ఇది సరైంది కాదని అభ్యతరం వ్యక్తం చేశారు. అయితే అలాంటి నిబంధనలు ఏవీ ఎన్నికల కమిషన్‌ విధించలేదని అధికారులు తెలిపారు. పోలింగ్‌కు ముందురోజు లోపు ఇంటింటికీ పోల్‌ స్లిప్పులు పంచుతారని చెప్పారు. ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో ఓటర్లకు పోలింగ్‌ కేంద్రం వివరాలు పంపితే బాగుంటుందని బీజేపీ ప్రతినిధులు సూచించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని అధికారులు అన్నారు. నామినేషన్ల సమయం నుంచే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును లెక్కిస్తామనీ, అంతకు ముందు పెట్టే ఖర్చును పార్టీల ఖర్చుగా పరిగణిస్తామని వివరణ ఇచ్చారు. బోగస్‌ ఓట్లపై ఇప్పుడేం చేయలేమనీ, అలాంటి వివరాలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఎన్నికల ఫిర్యాదులను సీ-విజిట్‌ వెబ్‌సైట్‌ ద్వారా, 1050 ఫోన్‌ నెంబర్‌ ద్వారా చేయవచ్చని తెలిపారు.
71 కోట్లు స్వాధీనం
అక్టోబర్‌ 9 నుంచి 17వ తేదీ వరకు మొత్తం రూ.71 కోట్ల 55 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే 52.091 లీటర్ల మద్యం, 1,280 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. 560 కిలోల గంజాయి, రూ.40.08 కోట్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు.