పంచాయతీ, మున్సిపల్‌ శాఖలతో సమన్వయం

– కేసులెక్కువగా ఉంటే ఓపీ సేవలు పెంచాలి
– ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలి : వర్షాల నేపథ్యంలో మంత్రి హరీశ్‌ రావు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు పెరగకుండా నివారణకు పంచాయతీ, మున్సిపల్‌ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆశాలు, ఏఎన్‌ఎంలు, మెడికల్‌ ఆఫీసర్లతోమంత్రి నెలవారీ సమీక్ష టెలికాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. ఈ కాన్ఫరెన్సులో హెల్త్‌ సెక్రెటరీ రిజ్వీ, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అన్ని స్థాయిల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనీ, వైద్యసేవలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలనీ, డెలివరీ డేట్‌కు ముందుగానే గర్భిణులను ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు. పాము, కుక్కకాటుకు మందులను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఆగస్టులో ప్రభుత్వాస్పత్రుల్లో రికార్డు స్థాయిలో 76.3 శాతం డెలివరీలు జరిగాయని మంత్రి తెలిపారు.