అనుమతుల్లేని మరమ్మతుల వల్లే కోరమాండల్‌ ఘోరం

Unauthorized Coromandel is bad because of repairs– ఒడిశాలో రైలు ప్రమాదానికి కారణం.. సీబీఐ
– ఉగ్రవిధ్వంసమంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు దుర్ఘటనకు అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడమే కారణమని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వెల్లడించింది. సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ (సిగల్‌ ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ మహంత.. ఉన్నతాధికారుల నుంచి సరైన అనుమ తులు తీసుకోకుండా క్షేత్ర స్థాయిలో మరమ్మతులు చేయించారని తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయ స్థానానికి సీబీఐ వివరించింది. రైలు దుర్ఘటనకు సంబంధించి సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురిలో ఒకరైన అరుణ్‌ కుమార్‌ మహంత తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ భువనేశ్వర్‌లోని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. దీనిని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది.
బహానగా బజార్‌ స్టేషన్‌ సమీపంలో ప్రమాదం జరిగిన 94వ క్రాసింగ్‌ లెవెల్‌ గేట్‌ వద్ద మరమ్మతు పనులు మహంత సమక్షంలోనే జరిగాయని కోర్టుకు వివరించింది. దీనికోసం ఆయన సీనియర్‌ డివిజినల్‌ ఇంజినీర్‌ (సిగల్‌ అండ్‌ టెలికం) నుంచి అనుమతు లు గానీ, సర్క్యూట్‌ చిత్రంగానీ తీసుకోలేదని తెలిపింది. గేట్‌ నెంబరు 79 వద్ద మరమ్మతులకు ఉపయోగించిన సర్క్యూట్‌ చిత్రం ఆధారంగానే ఇక్కడ మరమ్మతులు చేసినట్టు తమ దర్యాప్తులో తేలిందని వివరించింది. పనులు జరుగుతున్నప్పుడు మహంత అక్కడే ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలోనే మరమ్మతులు చేపట్టారని, అందువల్ల ఆయనకు బెయిల్‌ మంజూరు చేయొద్దని కోరారు.మహంత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రమాదా నికి కారణంగా భావిస్తున్న లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌ గత కొంత కాలంగా సరిగా పని చేయడం లేదని, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. పర్యవేక్షణ పనిని ఇతర వ్యక్తులకు అప్పగించారని, అందువల్ల ప్రమాదానికి మహంత బాధ్యుడు కాదని అన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం మహంతకు బెయిల్‌ నిరాకరించింది. సిగల్‌, ఇంటర్‌లాకింగ్‌ ఇన్‌స్టాలేషన్ల ను పరీక్షించడం, సరిదిద్దడం, మార్పులు చేయడం పిటిషనర్‌ (మహంత) విధుల్లో భాగమని పేర్కొంది. ఉన్నతాధికారులు ఆమోదించిన సూచనలకు అనుగు ణంగా అతడు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండేదని అభిప్రాయపడింది. అందులో విఫలమైనందువల్లే.. 296 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పో వాల్సి వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం అందుబాటు లో ఉన్న వివరాల ప్రకారం..ఈ ప్రమాదానికి మహం తానే ప్రధాన కారకుడని కోర్టు భావిస్తోందని పేర్కొంది. జూన్‌ 2న ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపం లో బహానగా బజార్‌ స్టేషన్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 296 మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికిపైగా క్షతగాత్రులైన సంగతి తెలి సిందే. షాలీమార్‌-చెన్నై కోరమాండల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మెయిన్‌లైన్‌లోకి వెళ్లడానికి సిబ్బంది గ్రీన్‌సిగల్‌ ఇచ్చి, వెనక్కి తీసుకున్నారు.
దీంతో ఆ రైలు లూప్‌లైన్లోకి వెళ్లి అప్పటికే అక్కడ ఆగి ఉన్న గూడ్సురైలును ఢకొీట్టింది. ఆ తీవ్రతకు కోరమాండల్‌లోని కొన్ని బోగీలు ఎగిరి, పక్కనున్న ట్రాకుపై పడ్డాయి. అదే సమయంలో ఆ మార్గంలో దూసుకువస్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ రైలు వాటిని ఢకొీట్టి పట్టాలు తప్పింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోవడంతో పెను విషాదం చోటుచేసుకుంది. కేంద్రం సిఫారసు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ ముగ్గురిని అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో సెక్షన్‌ ఇంజినీర్‌ (సిగల్‌) అరుణ్‌ కుమార్‌ మహంత, సెక్షన్‌ ఇంజినీర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ ఖాన్‌, టెక్నిషియన్‌ పప్పు కుమార్‌లు ఉన్నారు. ఇప్పటిదాకా ఉగ్రచర్యగా అభివర్ణించినా..కాదని సీబీఐ దర్యాప్తులో తేలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.