కరోనా కేసులు పెరుగుతున్నరు

– కొత్తగా 1890 కోవిడ్‌ కేసులు నమోదు
– 149 రోజుల తర్వాత ఇదే అత్యధికం
– కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. భారత్‌లో కొత్తగా 1890 కేసులు నమోదయ్యాయి. 149 రోజుల తర్వాత దేశంలో ఇంత మొత్తంలో కేసులు అధికంగా నమోదుకావడం గమనార్హం. చివరగా గతేడాది అక్టోబర్‌ 28న దేశంలో 2208 కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. కేంద్రం సమాచారం ప్రకారం.. భారత్‌లో ఏడు కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇవి మహారాష్ట్ర(2), గుజరాత్‌ (2), కేరళ (3) రాష్ట్రాల నుంచి ఉన్నాయి. దీంతో కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందినవారి సంఖ్య 5,30,831కి చేరింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.47 కోట్లకు పైగా ( 4,47,04,147 కేసులు) చేరుకున్నది. ఇందులో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.02 శాతంగా ఉన్నది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.56 శాతంగా నమోదైంది. కోవిడ్‌-19 రికవరీ రేటు 98.79 శాతంగా ఉన్నది. 4,41,63,883 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మరణాల రేటు 1.19శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా 220.65 కోట్ల డోసుల కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించబడింది.