అవినీతి మయమైన కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు..

నవతెలంగాణ – ఆర్మూర్ 
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవినీతిమయం అయినాయని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం కొనసాగుతున్నందున ఎన్నికల తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ అన్నారు.  మండలం లోని అంకాపూర్ గ్రామంలోని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి నివాస గృహంలో బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పాకిస్తాన్ ఆహార కొరతతో అల్లాడుతూ అంతర్గతంగా పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. దేశంలో కరోనా సమయంలో ప్రధాని  చొరవ తీసుకొని 80 కోట్ల మందికి మూడు విడుతలుగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారని, మరో ఐదేళ్లు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు. ప్రధాని మోడీ చొరవతో చంద్రయాన్ విజయవంతమైందన్నారు. గతంలో మాదిరిగా కాకుండా దేశీయంగానే ఉత్పత్తులు తయారీ కావడం వలన యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఢిల్లీలో రాజ్ పత్ పేరును కర్తవ్య పత్ గా మార్చినట్లు తెలిపారు. ప్రధాని మోడీ మైనార్టీ మహిళలకు సంబంధించిన తలాక్, 370 నీ రద్దు చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతిమయమైన పార్టీలన్నారు. కాంగ్రెస్ అవినీతి, అక్రమాలు దేశ ప్రజలందరికీ తెలుసు అన్నారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆర్మూర్ లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి విజయం థత్యం మన్నారు. రాకేష్ రెడ్డి పెద్ద మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మద్యం కేసులో మాజీ ఎంపీ కవిత తప్పు చేస్తే శిక్ష అనుభవించడం ఖాయమన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయంలో నాణ్యత లోపం, అవినీతి అక్రమాలు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదన్నారు. బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదవీకాలం పూర్తి కావడంతో కేంద్ర అధిష్టానం కొత్త అధ్యక్షుని నియమించినట్లు వివరించారు. ఈ సమావేశంలో   రాష్ట్ర కార్యదర్శి గంగారెడ్డి,  ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్,  జిల్లా మాజీ అధ్యక్షుడు  గంగారెడ్డి పాల్గొన్నారు.