– పీఎంఎల్‌ఎ నిబంధనలకు విరుద్ధం
– గ్లోబల్ ఎన్‌పీఓ కొయిలేషన్ నివేదిక వెల్లడి
– ఎఫ్‌ఏటీఎఫ్ చట్రపరిధిలోకి తీసుకురావాలని సూచన
ముంబయి : మనీ లాండరింగ్ నిరోధక చట్టానికి (పిఎంఎల్‌ఎ) పూర్తి విరుద్ధంగా వున్న ఎన్నికల బాండ్లపథకం పాలక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని గ్లోబల్ ఎన్‌పిఓ కొయిలేషన్ తన ఇటీవలి నివేదికలో పేర్కొంది. ఆర్థిక కార్యకలాపాల టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఎటిఎఫ్) చట్రపరిధిలో ఎన్నికల బాండ్ల పథకాన్ని చేర్చాలని కోరింది. పేరులేకుండా వెలువడే ఈ ఎన్నికల బాండ్ల స్వభావంతో మనీ లాండరింగ్‌కు, అవినీతికి కావాల్సినంత అవకాశం వుందని పేర్కొంది. దానితో పాటూ పాలక పార్టీకి అనుకూలంగా జరిగేవి తెలుసుకునే పౌరుల రాజ్యాంగ హక్కును కూడా ఉల్లంఘిస్తోందని పేర్కొంది.
ప్రజాస్వామ్యానికి ఈ ఎన్నికల బాండ్ల పథకం కలిగించే సంక్లిష్ట ముప్పును ఈ నివేదిక నిశితంగా వివరించింది. ఈ బాండ్లపై సుప్రీంకోర్టు విచారణ గత మూడు రోజులుగా సాగుతున్న నేపథ్యంలో కొయిలేషన్ నివేదిక వెలువడింది. కాగా సుప్రీంఈ అంశంపై విచారణ పూర్తి చేసిన అనంతరం తన తీర్పును రిజర్వ్ చేసుకుంది.
ఎన్నికల బాండ్ల పథకం కేవలం పారదర్శకంగా లేకపోవడమే కాదు, చట్టబద్ధమైన మార్గాల ద్వారా మనీ లాండరింగ్‌కు గేట్లు తెరుస్తోందని గ్లోబల్ కొయిలేషన్ తన నివేదికలో పేర్కొంది. పైగా ఈ పథకంలో విరాళాలు ఇచ్చేవారి పేర్లు వెల్లడించకపోయే స్వభావంతో అనుమానాస్పదమైన, నిరవధికమైన విరాళాలకు దారి తీస్తోందని ఆ నివేదిక వాదిస్తోంది.
ఇటువంటి విరాళాలను గుర్తించడం కష్టసాధ్యమవుతుందని పేర్కొంది. 2017లో భారత రిజర్వ్ బ్యాంక్ చెప్పిందే ఇప్పుడు కొయిలేషన్ కూడా పునరుద్ఘాటించింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆర్‌బిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. తన అభ్యంతరం చెబుతూ కేంద్ర ఆర్థికత శాఖకు లేఖ కూడా రాసింది. బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తులు, సంస్థల పేర్లు వెల్లడించకపోవడం వల్ల పిఎంఎల్‌ఎ నిబంధనల స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని పేర్కొంది.