– 28 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
– జులై 8 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు
– 12న తొలివిడత సీట్ల కేటాయింపు
– మూడు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం వచ్చేనెల 26 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. శనివారం హైదరాబాద్‌లో ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. వచ్చేనెల 26 నుంచి ఆగస్టు తొమ్మిదో తేదీ వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ వంటి ప్రక్రియను వచ్చేనెల 26 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. వచ్చేనెల 28 నుంచి జులై ఆరో తేదీ వరకు ధ్రువపత్రాల పత్రాల పరిశీలన నిర్వహిస్తామని వివరించారు. అదేనెల 28 నుంచి జులై ఎనిమిదో తేదీ వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశముందని తెలిపారు. జులై 12న తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. అదేనెల 12 నుంచి19వ తేదీ వరకు ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. జులై 21 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అదేనెల 21,22 తేదీల్లో ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ వంటి ప్రక్రియను చేప ట్టేందుకు అవకాశముందని వివరించారు. అదేనెల 23న ధ్రువపత్రాల పరిశీల న ఉంటుందని పేర్కొన్నారు. జులై 21 నుంచి 24వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియను చేపట్టాలని కోరారు. అదేనెల 28న రెండో విడత సీట్లు కేటాయిస్తామని వివరించారు. అదేనెల 28 నుంచి 31వ తేదీ వరకు ఫీజు చెల్లింపుతోపాటు వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు.
ఆగస్టు 2 నుంచి తుదివిడత కౌన్సెలింగ్
ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఆగస్టు రెండో తేదీ నుంచి తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియను చేపడతామని నవీన్ మిట్టల్ తెలిపారు. అదేనెల మూడో తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని, నాలుగో తేదీ వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముందని పేర్కొన్నారు. ఆగస్టు ఏడో తేదీన తుదివిడత సీట్లు కేటాయిస్తామని వివరించారు. అదేనెల ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు ఫీజు చెల్లింపుతోపాటు వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. ఆయా తేదీల్లోనే అభ్యర్థులకు కేటాయించిన కాలేజీ ల్లో రిపోర్టు చేయాలని కోరారు. అదేనెల ఎనిమిదో తేదీన స్పాట్ అడ్మిషన్ల కోసం మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపారు. గతేడాది ఏ ర్యాంకు వారికి ఏ కాలేజీలో సీటు వచ్చిందన్న వివరాలను www.://tseamc et.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. వచ్చేనెల 21 నుంచి పూర్తిస్థాయి నోటిఫికేషన్‌తోపాటు తాజా మార్గదర్శకాలు ఆ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని వివరించారు. అభ్యర్థులు, తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌కు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని కోరారు.